GT vs CSK, 1 Innings Highlights: ఐపీఎల్ - 16 ప్లేఆఫ్స్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న ఫస్ట్ క్వాలిఫయర్‌లో ధోనీ సేన తడబడింది. గుజరాత్ బౌలర్ల ధాటికి చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 60, 7 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (34 బంతుల్లో 40, 4 ఫోర్లు) రాణించినప్పటికీ మిడిలార్డర్ వైపల్యంతో ఆ జట్టు 172 కే పరిమితమైంది. మరి ఈ లో స్కోర్‌ను పటిష్ట బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న గుజరాత్ టైటాన్స్ ముందు చెన్నై ఏ మేరకు డిఫెండ్ చేయగలదన్నది ఆసక్తికరం.
రాణించిన ఓపెనర్లు..
ఈ సీజన్‌లో నిలకడగా ఆడుతున్న కాన్వే - గైక్వాడ్‌ల జోడీ ఈ మ్యాచ్‌లో కూడా రాణించింది. దర్శన్ నల్కండే వేసిన రెండో ఓవర్లో ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గైక్వాడ్.. తర్వాత రెచ్చిపోయాడు. ఈ ఓవర్లో మూడో బాల్‌కు గైక్వాడ్.. గిల్‌కు క్యాచ్ ఇచ్చినా అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. వీలు దొరికినప్పుడు బౌండరీలు బాదినా ఓపెనర్లిద్దరూ దూకుడుగా ఆడలేకపోయారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో హార్ధిక్ కూడా స్పిన్నర్లు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్‌లతో పాటు మోహిత్ శర్మతో ఎక్కువ ఓవర్లు వేయించాడు. దీంతో సీఎస్కే స్కోరు వేగం తగ్గింది.
మోహిత్ వేసిన 9వ ఓవర్లో రెండో బాల్‌కు బౌండరీ కొట్టి ఈ సీజన్‌లో నాలుగో అర్థ సెంచరీ చేసుకున్న రుతురాజ్.. అతడే వేసిన 11వ ఓవర్లో మూడో బాల్‌కు లాంగాన్ వద్ద డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు. దీంతో 64 బంతుల్లో 87 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
వికెట్లు టపటప..
రుతురాజ్ నిష్క్రమణ తర్వాత చెన్నై స్కోరు వేగం తగ్గడంతో పాటు వికెట్లను కూడా త్వరత్వరగా కోల్పోయింది. సీఎస్కే భారీ ఆశలు పెట్టుకున్న శివమ్ దూబే (1) నూర్ అహ్మద్ వేసిన 12వ ఓవర్లో మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దర్శన్ నల్కండే వేసిన 15వ ఓవర్లో సిక్సర్ బాదిన రహానే (10 బంతుల్లో 17, 1 సిక్స్) కూడా అదే ఓవర్లో ఐదో బాల్‌కు బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద ఉన్న శుభ్‌మన్ గిల్ చేతికి చిక్కాడు. షమీ వేసిన 16వ ఓవర్లో కాన్వే నిష్క్రమించాడు. ఈ సీజన్‌లో చెత్త ఆటతో విఫలమవుతున్న అంబటి రాయుడు (9 బంతుల్లో 17, 1 ఫోర్, 1 సిక్స్)ను రషీద్ ఖాన్ 18వ ఓవర్లో చివరి బంతికి ఔట్ చేశాడు. అభిమానుల అరుపుల మధ్య స్టేడియంలోకి వచ్చిన ధోని (1) కూడా మోహిత్ శర్మ వేసిన 19వ ఓవర్లో హార్ధిక్ కు క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. ఆఖరి ఓవర్లో జడేజా (16 బంతుల్లో 22, 2 ఫోర్లు), మోయిన్ అలీ (9 నాటౌట్) మెరుపులతో ఆ జట్టు స్కోరు.. 170 మార్కు దాటింది.
గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ, షమీ తలా 2 వికెట్లు తీయగా.. దర్శన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ లు తలా ఓ వికెట్ తీశారు.