Players To Watch in KKR vs SRH: ఐపీఎల్ 2023 లో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడిన తర్వాత మూడు రోజుల క్రితం ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో సూపర్ విక్టరీతో బోణీ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను ఢీకొననుంది. ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇదే వేదికపై ఆర్సీబీని మట్టికరిపించిన కేకేఆర్.. ఎస్‌ఆర్‌హెచ్‌కు షాకిచ్చేందుకు సిద్దం కాగా, పంజాబ్ పై వచ్చిన విన్నింగ్ జోష్ ను కొనసాగించేందుకు ఎస్ఆర్‌హెచ్ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల తరఫున ఈ ఆటగాళ్ల ఆటను అస్సలు మిస్ కావొద్దు.
ఈడెన్ గార్డెన్‌లో సన్ ‘రైజ్’ అవ్వాలంటే వీళ్లే కీలకం..
రాజస్తాన్, లక్నోతో మ్యాచ్‌లో హైదరాబాద్‌కు మిస్ అయింది పంజాబ్ తో మ్యాచ్ లో కలిసొచ్చింది బౌలింగే. అసలు సన్ రైజర్స్ అంటేనే బౌలింగ్. కానీ ఆ రెండు మ్యాచ్ లలో మన బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కానీ పంజాబ్ఋతో మ్యాచ్ లో మాత్రం మార్కో జాన్సేన్ రాకతో మన పేస్ విభాగం పటిష్టమైంది. పంజాబ్ తో పోరులో జాన్సేన్ 3 ఓవర్లు వేసి 16 పరుగులే ఇచ్చి ఆదిలోనే ధావన్ సేనను 2 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. కేకేఆర్‌తో పోరులో కూడా పేస్ విభాగంలో ఇతడే కీలకం.
మార్కండే మ్యాజిక్ : రషీద్ ఖాన్ తర్వాత నిఖార్సైన స్పిన్నర్ కోసం వెతుకుతున్న సన్ రైజర్స్‌కు నేనున్నానంటూ రేసులోకి వచ్చాడు మయాంక్ మార్కండే. ఈ పంజాబ్ కుర్రాడు.. హైదరాబాద్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌కు అనుకూలించే ఈడెన్ గార్డెన్ పిచ్ పై కేకేఆర్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టించేందుకు మార్కండే సిద్ధమవుతున్నాడు.
త్రిపాఠి ఘనాపాటి: సన్ రైజర్స్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా ఉన్న బ్యాటర్ రాహుల్ త్రిపాఠి. తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైనా పంజాబ్‌తో పోరులో త్రిపాఠి సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. క్రీజులో నిలిచాడంటే ఎంతటి బౌలర్ నైనా ఎదుర్కోగలిగే సత్తా త్రిపాఠి సొంతం. ఆది నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ గేమ్‌ను మార్చేసే సామర్థ్యమున్న రాహుల్ గతంలో ఈడెన్ గార్డెన్ లో చాలా మ్యాచ్‌లు ఆడినవాడే. హైదరాబాద్ కు రాకముందు త్రిపాఠి.. కేకేఆర్ తరఫున ఈడెన్ గార్డెన్‌లో ఆడిన అనుభవముంది. ఇక్కడి పిచ్ ఎలా స్పందిస్తుందనేది అతడికి బాగా తెలుసు. ఇది హైదరాబాద్ కు లాభించేదే.
మార్క్‌రమ్ మార్క్ : ఈ సీజన్‌లో హైదరాబాద్ సారథిగా ఆడుతున్న మార్క్‌రమ్.. లక్నోతో మ్యాచ్ లో విఫలమైనా పంజాబ్‌తో పుంజుకున్నాడు. త్రిపాఠికి తోడుగా నిలిచినా మార్క్‌రమ్ ఇన్నింగ్స్‌నూ తక్కువ చేయడానికి వీళ్లేదు. బ్యాటర్ గానే గాక సారథిగా కూడా ఇప్పుడు అతడి మీద అదనపు బాధ్యతలు ఉండటంతో పరిస్థితులకు తగినట్టు ఆడటం అవసరం. సౌతాఫ్రికాలో జనవరిలో ముగిసన ఎస్ఎ 20, వెస్టిండీస్, నెదర్లాండ్స్‌తో ద్వైపాక్షిక సిరీస్ లలో రాణించి జోరుమీదున్న మార్క్‌రమ్ ఈడెన్ గార్డెన్‌లో తన మార్క్ చూపిస్తే హైదరాబాద్ కు తిరుగుండదు.
బ్రూక్ ఇకనైనా : సన్ రైజర్స్ గత వేలంలో రూ. 13.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఇంకా ఈ లీగ్ లో తన మార్క్ చూపించలేదు. మూడు మ్యాచ్‌లలో విఫలమైనా బ్రూక్ ప్రమాదకర ఆటగాడే. కాస్త కుదురుకుంటే తన విధ్వంసం ఎలా ఉంటుందో పాకిస్తాన్, న్యూజిలాండ్ పై అతడి ఆట చూసినవారికి తెలుసు. క్రీజులోకి కాన్ఫిడెన్స్ గానే వస్తున్న బ్రూక్.. ఐపీఎల్‌కు కొత్త. ఈ మ్యాచ్ లో అయినా అతడు మెరుపులు మెరిపిస్తే అది హైదరాబాద్ కు అదనపు బలమే..
కేకేఆర్ ఏం తక్కువ కాదు..!
హైదరాబాద్ తో పాటు కేకేఆర్ కూడా ఏం తక్కువ తిన్లేదు. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో 200 ప్లస్ టార్గెట్ ను ఆ జట్టు ఛేదించిన తీరు నబూతో నభవిష్యత్. ముఖ్యంగా రింకూ సింగ్. ఆఖరి ఓవర్లో ఏ బెరుకూ లేకుండా ఆడిన ఈ అలీగఢ్ కుర్రాడు చివర్లో బంతిని బౌలర్ల చేతిలో కంటే గాల్లోనే ఎక్కువ ఉంచగల సమర్థుడు. రింకూతో పాటు కేకేఆర్ ఓపెనర్ గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ లు మ్యాచ్ ను మలుపు తిప్పే ఆటగాళ్లే.