RCB Fans Trolls Shahneel Gill: ఐపీఎల్ -16 లో భాగంగా ఆదివారం రాత్రి చిన్నస్వామి వేదికగా ముగిసిన మ్యాచ్‌లో తమ అభిమాన జట్టుపై సెంచరీ చేసి, ఆ టీమ్ క్వాలిఫై ఆశలను ఆవిరి చేసిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, అతడి సోదరిని లక్ష్యంగా చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్యాన్స్‌కు గిల్ కౌంటర్ ఇచ్చాడు. గుజరాత్ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో ఆర్సీబీ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్.. గిల్, అతడి సోదరి షానీల్ గిల్‌ను టార్గెట్‌గా చేసుకుని దూషణలకు దిగారు. గిల్ కార్ యాక్సిడెంట్‌లో చావాలని.. అతడి చెల్లినైతే రాయడానికి వీలులేని పదజాలంతో దూషిస్తూ కామెంట్స్ పెట్టారు.
షానీల్ గిల్ ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఆమెను దూషిస్తూ చేసిన పోస్టులు దుమారం రేపాయి. అభిమానం హద్దు మీరితే ఇలాగే జరుగుతుందని.. ఆట అన్నప్పుడు గెలుపోటములు సహజమే అయినా కుటుంబాలను ఇందులోకి లాగడం మంచి పద్ధతి కాదని నెటిజన్లు కామెంట్స్ చేశారు. కొంతమంది మితి మీరి ‘షానీల్ ఖలిస్తాని మద్దతుదారు’ అని తిట్టిపోశారు.
షానీల్ ప్రైవేట్ ఫోటోలను షేర్ చేస్తూ అభ్యంతరకర కామెంట్స్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (డీసీడబ్ల్యూ) చైర్ పర్సన్ స్వాతి మల్వాల్ కూడా కోరారు. షానీల్ పై ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్న దాడిని ఆమె ఖండించారు.
కాగా తాను, తన సోదరిపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిపై నేరుగా స్పందించని గిల్.. ఇందుకు సంబంధించి అతడి అభిమాని ఒకర ‘ఎ ఓపెన్ లెటర్ టు విరాట్ ఫ్యాన్స్’ అని రాసి ఉన్న ట్వీట్‌ను లైక్ చేశాడు.
కోహ్లీ ట్వీట్‌కూ కామెంట్..
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆ జట్టు ప్లేఆఫ్స్ స్టేజ్ నుంచి నిష్క్రమించిన తర్వాత తన సోషల్ మీడియా వేదికగా 'ఈ సీజన్లో మాకు మంచి మూమెంటమ్ లభించింది. కానీ దురదృష్టవశాత్తు లక్ష్యానికి కాస్త దూరంలో ఆగిపోయాం. నిరాశపరిచాం. ఏదేమైనా మనం తలెత్తుకొని నిలబడాల్సిన తరుణం ఇది. మా ప్రయాణంలో ప్రతి దశలోనూ అభిమానులు, సపోర్టర్స్ మాకు అండగా నిలబడ్డారు. మా కోచింగ్ బృందం, మేనేజ్‌మెంట్, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు. మేం మళ్లీ ఘనంగా తిరిగొస్తాం' అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు గిల్.. నువ్వెప్పుడూ కింగ్‌వే అని అర్థం వచ్చేలా కిరీటం ఎమోజీలను పెట్టి కామెంట్ చేశాడు. ఇది కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.