Darshan Nalkande Profile: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ లో భాగంగా చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ పేసర్ యశ్ దయాల్‌ను తప్పించి యువ బౌలర్ దర్శన్ నల్కండేకు అవకాశం ఇచ్చింది.
ఎవరీ దర్శన్..?
దర్శన్ నల్క్ండేకు ఐపీఎల్‌లో ఇదే ఫస్ట్ మ్యాచ్ కాదు. అతడు గత సీజన్‌లోనే ఈ లీగ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. మహారాష్ట్ర (వార్దా) కు చెందిన ఈ యువ పేసర్ పూర్తి పేరు దర్శన్ గిరీష్ నల్కండే. దేశవాళీ క్రికెట్‌లో విదర్భ తరఫున ఆడుతున్నాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన దర్శన్‌కు.. వాస్తవానికి ఐపీఎల్‌లో ఇది ఐదో సీజన్. 2019లోనే దర్శన్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 30 లక్షల కనీస ధరతో కొనుగోలు చేసింది. 2019, 2020, 2021 దాకా అతడు పంజాబ్ టీమ్‌తోనే ఉన్నాడు. కానీ మూడు సీజన్లలో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఐపీఎల్ -2022లో అతడిని గుజరాత్ టైటాన్స్.. రూ. 20 లక్షలతో కొనుగోలు చేసింది.
గత సీజన్‌లో గుజరాత్ తరఫున దర్శన్ రెండు మ్యాచ్‌లు కూడా ఆడాడు. తనను మూడు సీజన్ల పాటు ఆడించకుండా దూరంగా పెట్టిన పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్‌తో కూడా ఆడినా ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో..
ఈ విదర్భ బౌలర్ 2018లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకూ 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 21 లిస్ట్ ఎ, 34 టీ20లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ల ఒక్క వికెట్ మాత్రమే తీసినా లిస్ట్ ఎ లో 34, టీ20లలో 57 వికెట్లు పడగొట్టాడు. టీ20 మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన 5-9 గా ఉండటం గమనార్హం. సయీద్ ముస్తాక్ అలీ ట్రోపీలో అతి తక్కువ మ్యాచ్‌లలోనే 50 వికెట్లు పడగొట్టిన బౌలర్లలో దర్శన్ (28 మ్యాచ్‌లు) ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.
చెన్నైతో మ్యాచ్‌లో దర్శన్.. సీఎస్కే ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేశాడు. ఈ ఓవర్‌లో అతడు వేసిన మూడో బంతికి గైక్వాడ్.. గిల్‌కు క్యాచ్ ఇచ్చినా అది నోబాల్ కావడంతో అతడు బతికిపోయాడు. కానీ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గైక్వాడ్ మాత్రం తర్వాత రెచ్చిపోయాడు. ఇదే ఓవర్లో 6,4 కొట్టాడు. కాగా ఈ మ్యాచ్ లో గైక్వాడ్.. 44 బంతుల్లోనే 7 బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో 60 పరుగులు చేశాడు.