Deepak Chahar Injury: ఐపీఎల్-16లో శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ నెగ్గిన ఉత్సాహంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో భారీ షాక్ తప్పేట్టు లేదు. ముంబైతో మ్యాచ్‌కు ముందు సీఎస్కే ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ చేతికి గాయంతో దూరమయ్యాడు. అతడికి వారం రోజుల విరామం అవసరమని వైద్యులు సూచించడంతో నిన్నటి మ్యాచ్ ఆడలేదు. కాగా ముంబైతో మ్యాచ్ జరుగుతుండగానే సీఎస్కేకు మరో షాక్ తగిలింది. చెన్నై కీలక పేసర్ దీపక్ చాహర్ గాయంతో గ్రౌండ్‌ను వీడాల్సి వచ్చింది.
ఏం జరిగింది..?
ఈ సీజన్‌లో తొలి ‘ఎల్ క్లాసికో’ మ్యాచ్‌లో భాగంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇన్నింగ్స్‌లో దీపక్ చహర్ తొలి ఓవర్ వేశాడు. ఈ ఓవర్ ముగిసేటప్పటికీ చహర్ గతంలో మాదిరిగానే తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బందిపడ్డాడు. ఒక్క ఓవర్ వేయగానే అతడు నొప్పితో విలవిల్లాడు. ఫిజియోలు వచ్చి నొప్పి తగ్గించేందుకు యత్నించినా సాధ్యం కాకపోవడంతో అతడు డగౌట్ కు చేరుకున్నాడు.
నాలుగైదు మ్యాచ్‌లు అనుమానమే..!
చహర్ నొప్పితో ఇబ్బందిపడుతూ గ్రౌండ్‌ను వీడుతున్న తరుణంలో సీఎస్కే మాజీ ఆటగాడు, ప్రస్తుతం జియో సినిమాలో హిందీ కామెంట్రీ చెబుతున్న సురేశ్ రైనా స్పందిస్తూ.. ‘చూస్తుంటే చాహర్ కు మళ్లీ తొడ కండరాలు పట్టేసినట్టు అనిపిస్తుంది. ఇది చెన్నైకి ఇబ్బందికర పరిస్థితే. దీపక్ మరో నాలుగైదు మ్యాచ్‌లు ఆడేది అనుమానంగానే ఉంది. చెన్నై జట్టు తాము ఇతర వేదికల్లో ఆడే మ్యాచ్‌లకు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఇది వాళ్లకు కాస్త అసౌకర్యం కలిగించేదే..’అని చెప్పాడు. సీఎస్కే వర్గాలు దీపక్ గాయంపై అధికారిక ప్రకటన చేయకపోయినా అతడు కొన్ని మ్యాచ్‌లకు ఆడటం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా ఇదే విషయమై ముంబైతో మ్యాచ్ ముగిశాక సీఎస్కే సారథి ధోని మాట్లాడుతూ... ‘ముంబైపై మ్యాచ్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. కానీ మేం తొలి ఓవర్లోనే మా ప్రధాన పేసర్ దీపక్ చాహర్ సేవల్ని కోల్పోయాం..’ అని చెప్పాడు. చాహర్ గాయంపై ధోని కూడా ఇంతకు మించి అప్డేట్ ఇవ్వలేకపోయాడు. ఈ నేపథ్యంలో చెన్నై తర్వాత ఆడబోయే మ్యాచ్‌లకు చాహర్ అందుబాటులో ఉంటాడా..? లేదా..? అన్నది అనుమానంగానే ఉంది.
స్టోక్స్ ప్లేస్‌లో రఫ్ఫాడించిన రహానే..
ముంబైతో మ్యాచ్‌లో సీఎస్కే బెన్ స్టోక్స్ లేకుండానే ఆడింది. వాంఖెడేలో ప్రాక్టీస్ చేస్తుండగా స్టోక్స్ చేతి మడమకు గాయమైనట్టు చెన్నై వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం స్టోక్స్ గాయపడగా అతడికి వైద్యులు కనీసం పది రోజుల విశ్రాంతి అవసరమని సూచించారని సమాచారం. అయితే నిన్నటి మ్యాచ్ లో అజింక్యా రహానే స్టోక్స్ లోని లోటును తీర్చాడు. డెవాన్ కాన్వే నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే.. ముంబైకి ఊహించని షాక్ ఇచ్చాడు. చెన్నైకి ఈ ఒక్కమ్యాచ్‌కు సర్‌ప్రైజ్ ప్యాకేజీలా దొరికిన రహానే.. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్ లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. మొత్తంగా 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసిన రహానే.. సీఎస్కేకు ఈజీ విక్టరీ అందించాడు.