DC vs MI 1st Innings  Highlights: వరుసగా మూడు మ్యాచ్ లలో  ఓడి ఐపీఎల్ -16లో బోణీ కొట్టాలని తహతహలాడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్.. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ లో మిడిల్ ఓవర్స్‌లో తడబడినా  తర్వాత పుంజుకుంది.   ఢిల్లీ సారథి  డేవిడ్ వార్నర్ (51: 47 బంతుల్లో, 6 బౌండరీలు), ఆల్ రౌండర్ అక్షర్ పటేల్  (54: 25 బంతుల్లో 4 బౌండరీలు, 5 సిక్సర్లు) లు ఆ జట్టును ఆదుకోవడమే గాక  బౌలర్లకు పోరాడే స్కోరును అందించారు. టాపార్డర్ విఫలమైన  చోట అక్షర్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. వార్నర్ అండగా చివర్లో రెచ్చిపోయి ఢిల్లీకి మెరుగై స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరూ రాణించడంతో ఢిల్లీ.. 19.2 ఓవర్లలో  172 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో చావ్లా  రాణించి కీలక వికెట్లు పడగొట్టినా మిగిలిన  బౌలర్లు  లయ తప్పి భారీ పరుగులు సమర్పించుకున్నారు. కానీ ఆఖర్లో మళ్లీ ఢిల్లీ  భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. 


టాస్ ఓడి  ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన  ఢిల్లీ క్యాపిటల్స్‌కు  గత మ్యాచ్‌లలో కంటే కాస్త మెరుగైన ఆరంభమే దక్కింది.  మూడు మ్యాచ్‌లలో ఇలా క్రీజులోకి వచ్చి అలా వెళ్లిపోయిన  పృథ్వీ  షా (15: 10 బంతుల్లో, 3 బౌండరీలు)    మూడు ఫోర్లు కొట్టి  టచ్‌లోకి వచ్చినట్టే కనిపించాడు.   కానీ  హృతీక్ షోకీన్ వేసిన నాలుగో ఓవర్లో  నాలుగో బాల్‌ను స్కేర్ లెగ్ దిశగా ఆడి   కామెరూన్ గ్రీన్ చేతికి చిక్కాడు. దీంతో 33 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.


చావ్లా  మ్యాజిక్..


వన్ డౌన్‌లో వచ్చిన  మనీష్ పాండే  (26: 18 బంతుల్లో 5 బౌండరీలు) మెరిడిత్ వేసిన  ఐదో ఓవర్లో  వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. ఆ మరుసటి ఓవర్  వేసిన హృతీక్ శోకీన్ బౌలింగ్‌లో కూడా ఇదే రిపీట్ అయింది. కానీ  చావ్లా రాకతో  ఢిల్లీ కథ మారిపోయింది. వార్నర్ తో కలిసి  రెండో వికెట్‌కు  43 పరుగులు జోడించిన పాండే‌ను చావ్లా  ఔట్ చేశాడు.  ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న యశ్ ధుల్ (2) నాలుగు బంతులే ఆడి  మెరిడిత్ వేసిన పదో ఓవర్లో ఐదో బంతికి డీప్ స్క్వేర్ దిశగా ఆడి నెహల్ వధేరకు క్యాచ్ ఇచ్చాడు.  ఆడిన తొలి బంతినే బౌండరీకి తరలించిన రొవ్మన్ పావెల్  (4)ను చావ్లా  వికెట్ల ముందు బలిగిన్నాడు.  రాజస్తాన్‌తో మ్యాచ్ లో  ఫర్వాలేదనిపించిన  లలిత్ యాదవ్   (2) కూడా చావ్లా వేసిన 13వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 


ఆదుకున్న వార్నర్ - అక్షర్.. 


ఓపెనర్‌గా వచ్చిన వార్నర్ ఒకవైపు తన సహచర ఆటగాళ్లు  ఒక్కొక్కరుగా  క్రీజు వదులుతున్నా నిలకడగా ఆడాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడిన వార్నర్ 37 పరుగుల వద్ద ఉండగా  రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఢిల్లీ సారథి..  98 కే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో  ఆ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే అది వార్నర్ - అక్షర్ ల చలవే.  హృతీక్ వేసిన 15వ ఓవర్లో  రెండు భారీ సిక్సర్లు బాదిన అక్షర్.. గ్రీన్ బౌలింగ్ లో కూడా ఓ బౌండరీ రాబట్టాడు. ఇదే ఓవర్లో  నాలుగో బంతికి  సింగిల్ తీయడం ద్వారా  వార్నర్ 43 బంతుల్లో  అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.  బెహ్రాండార్ఫ్ వేసిన 17వ ఓవర్లో అక్షర్ రెండు సిక్సర్లు కొట్టి ఢిల్లీ స్కోరును 150 దాటించాడు. మెరిడిత్ వేసిన మరుసటి ఓవర్లో 4,6  బాదాడం ద్వారా  22 బంతుల్లోనే అక్షర్ అర్థ సెంచరీ పూర్తయింది.  


ఆఖర్లో మళ్లీ మొదటికి.. 


మరో రెండు ఓవర్లు ఉండటం.. వార్నర్ - అక్షర్ లు కూడా కుదురుకోవడంతో  ఢిల్లీ భారీ స్కోరు చేస్తుందని అంతా భావించారు.  కానీ బెహ్రాండార్ఫ్ వేసిన 19వ ఓవర్లో  ఢిల్లీ మొదటి బంతికి అక్షర్, మూడో బంతికి  వార్నర్, నాలుగ్ బంతికి   కుల్దీప్  (రనౌట్), ఆఖరి బంతికి   పొరెల్  వికెట్లను కోల్పోయింది.  ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోవడంతో  ఢిల్లీ  172 పరుగుల వద్దే ఆగిపోయింది.  ముంబై బౌలర్లలో బెహ్రాండార్ఫ్, చావ్లాలు తలా మూడు వికెట్లు తీశారు.