Inzamam-ul-Haq: ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు ముందు  దాయాది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)  పరిపాలనా విభాగంతో పాటు జట్టులో కూడా కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది.  పాకిస్తాన్ దిగ్గజ సారథి, గతంలో ఆ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా కూడా పనిచేసిన ఇంజమామ్ ఉల్ హక్‌కు మరోసారి అవే బాధ్యతలు అప్పజెప్పనున్నట్టు తెలుస్తున్నది.   ఇదే జరిగితే  సెలక్షన్ కమిటీలో  ఉన్న టీమ్ డైరెక్టర్ మికీ ఆర్థర్, హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌లు ఉంటారా..? లేదా..? అన్నది కూడా అనుమానంగానే ఉంది. 


పీసీబీకి ఛైర్మన్‌గా ఎంపికయ్యాక  జకా అష్రఫ్  పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు.  ఇప్పటికే మిస్బా ఉల్ హక్, మహ్మద్ హఫీజ్‌లతో పాటు ఇంజమామ్ ఉల్ హక్‌లతో టెక్నికల్ కమిటీని ఏర్పాటుచేసిన  పీసీబీ.. ఇప్పుడు ఇంజమామ్‌కు చీఫ్  సెలక్టర్ బాధ్యతలు కూడా అప్పగించనుంది.   ఇంజమామ్ గతంలో 2016 నుంచి 2019 వరకూ  చీఫ్ సెలక్టర్‌గా పనిచేశారు.  దీనిపై  త్వరలోనే ఓ నిర్ణయం వెలువడే అవకాశముంది.  ఇదివరకే సెలక్షన్ కమిటీలో ఉన్న మికీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌లను  ఆ కమిటీలో కొనసాగించాలా..? లేదా..? అన్నది కూడా  త్వరలోనే  తేలనుంది.


దీనిపై  టెక్నికల్ కమిటీ సభ్యులు.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్  అభిప్రాయాన్ని కూడా తీసుకోనున్నారు.  ఇదే విషయమై పీసీబీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘మిస్బా, ఇంజమామ్, హఫీజ్‌లతో కూడిన  టెక్నికల్ కమిటీ..  కొత్త సెలక్షన్ కమిటీ గురించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. అంతేగాక మికీ ఆర్థర్, బ్రాడ్‌బర్న్‌లు సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉండాలా..? లేదా..? అన్నది కూడా  చర్చించున్నారు’ అని చెప్పాడు. పీసీబీ మాజీ ఛైర్మన్ నజమ్ సేథీ హయాంలో ఆర్థర్, బ్రాడ్‌బర్న్‌లు సెలక్షన్ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు.  


 






వన్డే వరల్డ్ కప్  నేపథ్యంలో ఇంజమామ్‌ను నియామకాన్ని వీలున్నంత త్వరగా పూర్తిచేయాలని  పీసీబీ భావిస్తున్నట్టు సమాచారం.   వన్డే వరల్డ్ కప్ కంటే ముందు పాకిస్తాన్ ఆసియా కప్ ఆడాల్సి ఉంది. ఆసియా కప్‌లో ఆడబోయే పాక్ జట్టును  ఇంజమామ్  నేతృత్వంలోని  సెలక్షన్ కమిటీనే ఎంపిక చేస్తుందని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.


వరల్డ్ కప్‌కు సైకాలజిస్టుతో.. 


ద్వైపాక్షిక సిరీస్‌లలోనే  తీవ్ర ఉత్కంఠ  జరిగే మ్యాచ్‌లలో  ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాకిస్తాన్ జట్టు వన్డే వరల్డ్ కప్ కోసం కాస్త గట్టిగానే ప్రిపేర్ అయినట్టు తెలుస్తోంది.  ఈసారి భారత్‌లో జరుగబోయే  ప్రపంచకప్‌లో పాల్గొనబోయే పాకిస్తాన్ జట్టుతో ఓ సైకాలజిస్టును కూడా వెంట తెచ్చుకోనుంది. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు గాను సదరు సైకాలజిస్టు పాకిస్తాన్ ఆటగాళ్లను టిప్స్ ఇవ్వనున్నాడు. భారత్ - పాకిస్తాన్ వంటి హై ప్రొఫైల్ మ్యాచ్‌లో సహజంగానే ఒత్తిడి పీక్స్‌లో ఉంటుంది.  మిగిలిన మ్యాచ్‌లలో కూడా  పాకిస్తాన్  బ్యాటింగ్ లైనప్ ఎప్పుడెలా స్పందిస్తుందో తెలియని  పరిస్థితి ఉంది.  ఈ నేపథ్యంలో  జట్టుకు   సైకాలజిస్టు అవసరం ఉందని భావిస్తున్న పీసీబీ..  టీమ్‌తో పాటు మానసిక వైద్యుడిని కూడా పంపనున్నట్టు తెలుస్తున్నది. 




















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial