ODI World Cup 2023: అక్టోబర్ నుంచి భారత్‌లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మరో మ్యాచ్ షెడ్యూల్ మార్పు కానుందా..? అహ్మదాబాద్ వేదికగా భారత్ - పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ మార్పు కోసం బీసీసీఐ పంపిన ప్రతిపాదనను ఇదివరకే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆమోదం తెలిపిన నేపథ్యంలో మరోసారి పాకిస్తాన్ షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. నవంబర్ 12న ఇంగ్లాండ్ - పాకిస్తాన్ మధ్య జరుగబోయే మ్యాచ్ షెడ్యూల్ మార్చాలని తాజాగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) బీసీసీఐని కోరింది.
నవంబర్ 12న బెంగాల్ వ్యాప్తంగా కాళీ పూజ జరగాల్సి ఉంది. ఇక వెస్ట్ బెంగాల్ రాజధాని అయిన కోల్‌కతాలో కాళీ పూజ అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మొత్తం కోల్‌కతా పుర వీధుల్లోనే ఉంటారు. అదే రోజు ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగే పాకిస్తాన్ - ఇంగ్లాండ్ మ్యాచ్‌కు భద్రత కల్పించడం కష్టమవడమే గాక భద్రతా సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని బెంగాల్ సెక్యూరిటీ ఏజెన్సీలు కోరడంతో క్యాబ్ ఈ విషయాన్ని బీసీసీఐ వద్దకు తీసుకెళ్లింది. నవంబర్ 12న జరగాల్సిన మ్యాచ్‌ను ఒక్కరోజు ముందు (నవంబర్ 11కు) మార్చాలని కోరింది.
అక్టోబర్ 15న భారత్ - పాక్ మధ్య అహ్మదాబాద్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా ఒక్కరోజు ముందుగానే (అక్టోబర్ 14) నిర్వహించేందుకు ఐసీసీ, పీసీబీ అంగీకారం తెలిపిన నేపథ్యంలో తమ వినతిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని క్యాబ్ కోరుతోంది. మరి దీనికి బీసీసీఐ ఎలా స్పందిస్తుంది..? పీసీబీ, ఐసీసీలు ఏ మేరకు అంగీకారం తెలుపుతాయనేది ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ క్యాబ్ వినతిని పరిగణనలోకి తీసుకుంటే వరల్డ్ కప్ షెడ్యూల్‌లో పాకిస్తాన్‌కు మూడోసారి మార్పు తప్పేట్టు లేదు. అహ్మదాబాద్‌లో భారత్ - పాక్ మ్యాచ్ తేదీ మార్పు నేపథ్యంలో అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్‌ను 10నే ఆడనుంది. దీంతో భారత్‌తో ఆడబోయే మ్యాచ్‌కు ఆ జట్టుకు విరామం కూడా దొరుకుతుంది. ఇప్పుడు క్యాబ్ వినతిని కూడా ఆమోదిస్తే మరోసారి వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు తప్పేలా లేవు.
ఐసీసీ గత నెలలో ప్రకటించిన మేరకు ప్రస్తుతం పాకిస్తాన్ షెడ్యూల్ కింది విధంగా ఉంది.
- అక్టోబర్ 06 : పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ - హైదరాబాద్
- అక్టోబర్ 12 : పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక - హైదరాబాద్
- అక్టోబర్ 15 : పాకిస్తాన్ వర్సెస్ ఇండియా - అహ్మదాబాద్
- అక్టోబర్ 20 : పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా - బెంగళూరు
- అక్టోబర్ 23 : పాకిస్తాన్ వర్సెస్ అఫ్గానిస్తాన్ - చెన్నై
- అక్టోబర్ 27 : పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా - చెన్నై
- అక్టోబర్ 31 : పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ - కోల్‌కతా
- నవంబర్ 04 : పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ - బెంగళూరు
- నవంబర్ 12 : పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ - కోల్‌కతా
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఐసీసీలు సంయుక్తంగా జూన్ 27న ముంబై వేదికగా విడుదల చేసిన విషయం తదెలిసిందే. పండుగల సీజన్ కావడంతో మరి రాబోయే రోజుల్లో షెడ్యూల్‌లో మరేమైనా మార్పులు సంభవించనున్నాయా..? లేదా..? ఇక ఏది ఏమైనా ఐసీసీ, బీసీసీఐ ముందుకు సాగుతాయా..? అన్నది త్వరలోనే తేలనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial