Boxing Day Test Updates: భారత కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో టెస్టులో ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కన్ఫాం చేశాడు. ఈ సిరీస్ లో మిడిలార్డర్ లో ఆడుతున్న రోహిత్ ఘోరంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. రెండు టెస్టులు కలిపి, నాలుగు ఇన్నింగ్స్ ఆడిన హిట్ మ్యాన్ కేవలం 19 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్టులో తన పాత స్థానమైన ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. ఇప్పటివరకు ఓపెనర్ రోల్ లో ఆడిన కేఎల్ రాహుల్.. ఈ మ్యాచ్ లో వన్ డౌన్ లో దిగుతాడు. మరోవైపు ఈ సిరీస్ లో రాహుల్ అదరగొడుతున్నాడు. మూడు టెస్టుల్లో మొత్తం 235 పరుగులు చేసి, సిరీస్ లో రెండో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 


శుభమాన్ పై వేటు తప్పలేదు..
మరోవైపు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న వన్ డౌన్ బ్యాటర్ శుభమాన్ గిల్ పై వేటువేసి, అతని స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అభిషేక్ నాయర్ సమర్థించుకున్నాడు. మెల్ బోర్న్ వికెట్ కొంచెం నెమ్మదిగా, డ్రైగా ఉంటుందని, అందుకోసం అదనపు స్పిన్నర్ ను తీసుకున్నామని తెలిపాడు. అయితే జట్టు ప్రయోజనాల రిత్యా మాత్రేమే గిల్ ను డ్రాప్ చేశామని, పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని పేర్కొన్నాడు. వన్ డౌన్ లో గిల్ అద్భుతమైన ఆటగాడని, అయితే జట్టు కూర్పులో గిల్ కు చోటు దక్కకుండా పోయిందని పేర్కొన్నాడు. మరోవైపు ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. 


గల్లీ క్రికెట్ ఆడుతున్నావా...!
ఇక నాలుగో టెస్టులో జైస్వాల్ పై రోహిత్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ప్రారంభంలో వికెట్లు పడక పోవడంతో కాస్త అసహనానికి లోనైన హిట్ మ్యాన్.. ఫార్వర్డ్ షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్ ను మందలించాడు. బ్యాటర్ బంతిని కొట్టకముందే తాను పైకి ఎగరడం, క్యాచ్ కోసం సిద్ధంగా లేకపోవడంపై రోహిత్ కాస్త ఆగ్రహానికి వచ్చాడు. నువ్వేమైనా గల్లి క్రికెట్ ఆడుతున్నావా..? బ్యాటర్ కొట్టేవరకు అక్కడే కూర్చుని ఉండు, లేచావంటే బాగోదు* అని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో జైస్వాల్ బుద్దిగా ఫీల్డింగ్ కు దిగాడు. మరోవైపు ఈ క్లిప్పింగ్ వైరలైంది. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే దీనిపై మీమ్స్ కూడా చేయడం విశేషం. మరోవైపు నాలుగో టెస్టులో ఇరుజట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 86 ఓవర్లలో ఆరు వికెట్లకు 311 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ అజేయ అర్థ సెంచరీ చేయగా, శామ్ కొన్ స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ ఫిఫ్టీలతో ఆకట్టుకున్నారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో సత్తా చాటగా, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, సుందర్ కు తలో వికెట్ దక్కింది. ఐదు టెస్టుల సిరీస్ ఇప్పటికే 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టును భారత్ నెగ్గగా, రెండో టెస్టును ఆసీస్ కైవసం చేసుకుంది. వర్షం పలుమార్లు అంతరాయం కలగడం వల్ల మూడో టెస్టు డ్రా గా ముగిసింది. 






Also Read: Kohli Fined: కోహ్లీకి షాకిచ్చిన ఐసీసీ.. జరిమానాతో కన్నెర్ర.. బాక్సింగ్ డే తొలిరోజు వివాదానికి ఫుల్ స్టాప్