శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళల జట్టు పరాజయంతో ముగించింది. అయితే మొదటి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో సిరీస్‌ను మాత్రం 2-1తో సొంతం చేసుకుంది. మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 17 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో లంక ఏడు వికెట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
తడబడ్డ టీమిండియా...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు తమ నిర్ణయం తప్పని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఓపెనర్ షెఫాలీ వర్మ (5: 4 బంతుల్లో, ఒక ఫోర్) మొదటి ఓవర్లోనే ఇంటి ముఖం పట్టింది. మరో ఓపెనర్ స్మృతి మంథన (22: 21 బంతుల్లో, మూడు ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ సబ్బినేని మేఘన (22: 26 బంతుల్లో, మూడు ఫోర్లు) నిదానంగా ఆడటంతో స్కోరు నత్తనడకన సాగింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 6.4 ఓవర్లలో 41 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ మూడు పరుగుల వ్యవధిలోనే అవుట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది.
ఈ దశలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (39 నాటౌట్: 33 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), మిడిలార్డర్ బ్యాటర్ రోడ్రిగ్జ్ (33: 30 బంతుల్లో, మూడు ఫోర్లు) వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. నాలుగో వికెట్‌కు 56 బంతుల్లో 64 పరుగులు జోడించారు. 19వ ఓవర్లో రోడ్రిగ్జ్ అవుటయినా... చివర్లో పూజా వస్త్రాకర్ (13: 6 బంతుల్లో, రెండు ఫోర్లు) రెండు బౌండరీలు కొట్టడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
అదరగొట్టిన అటపట్టు
భారత్ తరహాలో శ్రీలంక కూడా మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ విష్మి గుణరత్నే (5: 5 బంతుల్లో, ఒక ఫోర్) మొదటి ఓవర్లోనే అవుట్ అయింది. అయితే మరో చమారి ఆటపట్టు (80 నాటౌట్: 48 బంతుల్లో, 14 ఫోర్లు, ఒక సిక్సర్) టీమిండియా బౌలర్లపై విరుచుకుపడింది. రెండో వికెట్‌కు హర్షిత మాధవితో (13: 14 బంతుల్లో, రెండు ఫోర్లు) 31 పరుగులు, మూడో వికెట్‌కు నిలాక్షి డిసిల్వతో (30: 28 బంతుల్లో, నాలుగు ఫోర్లు) కలిసి 77 పరుగులు జోడించింది. దీంతో శ్రీలంక కేవలం 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.