ఇంగ్లండ్ ప్రస్తుత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా ఫాంలో లేక విఫలం అవుతుండటంతో మోర్గాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మోర్గాన్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌటయ్యాడు.
అయితే మోర్గాన్ కేవలం కెప్టెన్సీ బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకుంటాడా లేక పూర్తిగా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. 35 ఏళ్ల ఈ ఇంగ్లండ్ క్రికెటర్ తన కెరీర్ మొత్తమ్మీద కేవలం 16 టెస్టులు మాత్రమే ఆడాడు. 16 టెస్టుల్లో 24 ఇన్నింగ్స్ ఆడి మొత్తంగా 700 పరుగులు సాధించాడు. వీటిలో రెండు సెంచరీలు, మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి.
ఇక 248 వన్డేల్లో 7,701 పరుగులు సాధించాడు. సగటు 39.09 కాగా... స్ట్రైక్ రేట్ 91.17గా ఉంది. వన్డే కెరీర్‌లో మొత్తం 14 శతకాలు, 47 అర్థ శతకాలు సాధించాడు. అత్యధిక స్కోరు 148 పరుగులు. 115 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 2,458 పరుగులు చేశాడు. టీ20 స్ట్రైక్ రేట్ ఏకంగా 136.18గా ఉంది. ఐపీఎల్‌లో మాత్రం మోర్గాన్ అంతగా రాణించలేకపోయాడు. దీంతో 2022 ఐపీఎల్ వేలంలో తనను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు.
అయితే ఇయాన్ మోర్గాన్ తర్వాత ఇంగ్లండ్‌కు తర్వాతి పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది సస్పెన్స్‌గా మారింది. లేటెస్ట్ సెన్సేషన్ జోస్ బట్లర్‌కు ఆ అవకాశం దక్కుతుందా? లేకపోతే బెన్ స్టోక్స్‌ను పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమిస్తారా అనేది తెలియాలంటే ఇంకొంతకాలం ఓపిక పట్టాల్సిందే!