PV Sindhu: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ. సింధుకు కోచ్ గా తప్పుకుంటున్నట్లు పార్క్ సాంగ్ తెలిపాడు. కొరియాకు చెందిన పార్క్ ఇప్పటివరకు సింధుకు శిక్షణ ఇచ్చాడు. తాజాగా వారి గురుశిష్యుల బంధం ముగిసింది. కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు పార్క్ ప్రకటించాడు.
ఇటీవల కాలంలో బ్యాడ్మింటన్ టోర్నీల్లో సింధు ప్రదర్శన ఏమంత బాలేదు. ఈ మధ్య ఆడిన మ్యాచ్ ల్లో ఆమె నిరాశపరించింది. ఇందుకు తానే బాధ్యత వహిస్తున్నట్లు పార్క్ తెలిపాడు. అందుకే కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 'కోచ్ గా సింధుతో నా ప్రయాణం ముగిసింది. ఇటీవల ఆమె ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. అందుకు నేనే బాధ్యత వహిస్తున్నా. ఆమె కూడా మార్పు కోరుకుంటోంది. కొత్త కోచ్ కావాలనుకుంటున్న సింధు నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా.' అని పార్క్ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించాడు.
2019 నుంచి పార్క్ సింధుకు కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన శిక్షణలో సింధు టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం నెగ్గింది. అలాగే కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతకం కూడా గెలుచుకుంది. 'వచ్చే ఒలింపిక్స్ వరకు నేను ఆమెతో ఉండలేకపోతున్నందుతు క్షమించండి. కోచ్ గా తప్పుకున్నా నేను బయటనుంచి ఆమెకు మద్దతిస్తూనే ఉంటా' అని పార్క్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ కు దూరం
పీవీ సింధు! ప్రపంచం మెచ్చిన షట్లర్! ప్రత్యర్థుల పాలిట కిల్లర్! ఇండియన్స్ అమితంగా ఇష్టపడే ప్లేయర్! ఆమె ఆడితే దేశమంతా ఎగిరి గంతులేస్తుంది. ఆమె పతకం గెలవడం సర్వ సాధారణమే అని తలుస్తుంది. ఆమె ఓడితే మనసులు గెలిచావని సరిపెట్టుకుంటుంది. సూపర్ 200, సూపర్ 300తో పోలిస్తే మెగా టోర్నీల్లో ఆమె ఆట మరింత రాటుదేలుతుంది. అంతర్జాతీయ స్టార్లకు సులువుగా షాకులిచ్చేస్తుంటుంది. అందుకే బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఆమె దూరమవ్వడం తీరని లోటు!
కామన్వెల్త్‌లో జోరు
కొన్ని రోజుల క్రితమే ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో పీవీ సింధు (PV Sindhu) అదుర్స్ అనిపించింది. మహిళల సింగిల్స్‌లో స్వర్ణం ముద్దాడింది. మెగా టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంది. శతకోటి భారతీయులను మురిపించింది. అయితే ఈ పతకం వెనక అకుంఠిత దీక్ష, పట్టుదల దాగున్నాయి. క్వార్టర్ ఫైనల్ నుంచే ఆమె కాలి మడమ నొప్పెడుతున్నా అలుపెరగని పోరాటం చేసింది. ఎంతో ఇబ్బంది పడుతున్నా, దూకుడుగా కదల్లేకున్నా నొప్పి నివారణ మందులు వాడి ముందుకు సాగింది. ఫిజియోలు, ట్రైనర్ల సహకారంతో సెమీస్, ఫైనల్ గెలిచేసింది.
కాలి మడమలో గాయం
బర్మింగ్ హామ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే పీవీ సింధు వైద్యుల వద్దకు వెళ్లింది. అవసరమైన ఎక్స్‌రేలు, స్కానింగులు తీయించుకుంది. కాలి మడమలో చిన్న చీలిక వచ్చిందన్న వైద్య నిపుణులు కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో తనకెంతో ఇష్టమైన, ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుంచి తప్పుకుంది. 'కామన్వెల్త్‌లో స్వర్ణం గెలిచిన సంతోషంలో ఉన్నప్పటికీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుంచి వైదొలగుతున్నా. క్వార్టర్ ఫైనల్ నుంచే నేను ఇబ్బంది పడ్డాను. కోచులు, ఫిజియోల సాయంతో స్వర్ణం గెలిచాను. హైదరాబాద్ వచ్చాక వైద్యుల్ని కలిశాను. స్కానింగ్‌లో ఎడమకాలి మడమలో స్ట్రెస్ ఫ్రాక్చర్ వచ్చిందన్నారు. కొన్నాళ్లు విశ్రాంతి అవసరం అన్నారు. త్వరలోనే మళ్లీ మీ ముందుకొస్తాను' అని సింధు ట్వీట్ చేసింది.