Rohit Sharma News: ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమవుతున్న భారత వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకు వన్డేలను కష్టకాలం తప్పకపోవచ్చని తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో జరిగే చాంపియన్స్ ట్రోపీకి సన్నాహకంగా ఇంగ్లాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు ఈ ఇద్దరు ప్లేయర్లకు విశ్రాంతినిచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రోహిత్, కోహ్లీలతోపాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా రెస్ట్ ఇచ్చి, యువ జట్టును ఆ సిరీస్ లో బరిలోకి దింపాలను సెలెక్టర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ప్రతిష్టాత్మక చాంపియన్స్ టోర్నీకి ముందు ఏకైక వన్డే సిరీస్ ఇదే కావడం విశేషం. ఇందులోనూ వీరిద్దరికి విశ్రాంతి ఇవ్వడంపై పలు సందేహాలు ముసురుకుంటున్నాయి. దీంతో ఈ సిరీస్ కు కొత్త కెప్టెన్ తో భారత్ బరిలోకి దిగే అవకాశముంది.
ఇప్పటికే టీ20లకు దూరం..
ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ ముగిశాక ఈ ఫార్మాట్ కు కోహ్లీ, రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. నిజానికి ఇంగ్లాండ్ తో 5 టీ20లు, మూడు వన్డేలను భారత్ ఆడనుంది. అయితే వన్డేలకు కూడా వీరిని పక్కన పెట్టడం చూస్తుంటే, చాంపియన్స్ ట్రోఫే ఈ ఇద్దరి ప్లేయర్లకు ఆఖరిదని తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కొత్త జట్టును రూపొందించాలని భారత జట్టు యాజమాన్యం పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే 37 ఏళ్ల వయసున్న రోహిత్, 36 ఏళ్ల వయసున్న కోహ్లీ.. వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో ఉండేది అనుమానమనే తెలుస్తోంది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ అయిపోయిన తర్వాత వీరు ఈ ఫార్మాట్ నుంచి వైదొలిగే అవకాశముంది. మరోవైపు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో ఏ ప్లేయర్ అయినా రాణిస్తే, అప్పుడు కోహ్లీ, రోహిత్ స్థానాలకు ఈ మెగాటోర్నీలో ముప్పు ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమని నిపుణులు పేర్కొంటున్నారు.
హైబ్రిడ్ మోడల్లో మెగాటోర్నీ..
ఈసారి చాంపియన్స్ ట్రోఫి పాకిస్థాన్ లో జరుగుతున్నందున అక్కడికి వెళ్లడానికి టీమిండియాకు బీసీసీఐ నుంచి అనుమతి రాలేదు. దీంతో యూఏఈలో భారత్ ఆడే మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఒకవేళ భారత్ సెమీస్, ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ లను కూడా అక్కడే నిర్వహిస్తారు. ఇక ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్ ను ఇప్పటికే ప్రకటించారు. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న చిరకాల ప్రత్యర్థి, డిఫెండింగ్ చాంపియన్ పాక్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఆడుతుండగా, గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ చోటు దక్కించుకున్నాయి. ప్రతి గ్రూపులోని జట్టు, అదే గ్రూపులోని ఇతర మూడు జట్లతో మూడు మ్యాచ్ లు అడుతుంది. ప్రతి గ్రూపులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్లోకి ప్రవేశిస్తాయి.