Melbourne Test News: ఆసీస్ గడ్డపై తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి సత్తా చాటాడు. అత్యంత క్లిష్టమైన దశలో బరిలోకి దిగిన నితీశ్ సూపర్ సెంచరీ (176 బంతుల్లో 105 బ్యాటింగ్, 10 ఫోర్లు, 1 సిక్సర్ )తో రాణించాడు. పటిష్టమైన ఆసీస్ బౌలింగ్ ను ఎదుర్కొని అంతర్జాతీయ కెరీర్ లో తొలి సెంచరీని సాధించాడు. బాక్సింగ్ డే టెస్టులో భాగంగా శనివారం మూడోరోజు ఈ ఘనత సాధించాడు. నితీశ్ సెంచరీ అవుతుందా..? లేదా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్న వేళ, బోలాండ్ బోలింగ్ లో లాంగాన్ దిశగా బౌండరీ బాదీ ఆసీస్ గడ్డపై తొలి సెంచరీ చేశాడు. 2019లో వెస్టిండీస్ పై హనుమ విహారి తర్వాత అంతర్జాతీయ టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి తెలుగు ప్లేయర్ గా నిలిచాడు. ఈ సెంచరీతో భారత్ .. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో నిలిచింది.
దూకుడుగా..
ఆసీస్ గడ్డపై క్రీజులో ఎక్కువగా గడిపితే పరుగులు వాటంతట అవే వస్తాయి అన్న సూత్రాన్ని ఒంటబట్టించుకున్న నితీశ్.. శనివారం బరిలోకి మూడు గంటలకుపైగా క్రీజులో నిలిచాడు. ప్రారంభంలో దూకుడుగా ఆడి ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. నాథన్ లయన్ బౌలింగ్ లో లాంగాన్ దిశగా భారీ సిక్సర్ కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు ఓ ఆటాడుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ నేపథ్యంలో అర్థం సెంచరీ చేసుకున్నాడు. పుష్ప స్టైల్లో తగ్గేది లే అన్నట్లు బ్యాట్ తోనే తన ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత మరింత జాగ్రత్తగా ఆడుతూ వాషింగ్టన్ సుందర్ (162 బంతుల్లో 50, 1 ఫోర్)తో కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించాడు.
సెంచరీతో తన మార్కు సంబరాలు..
నిజానికి సెంచరీ వైపు దూసుకెళుతున్న నితీశ్ కు ఒక్కసారిగా ఝలక్ ఎదురైంది. అప్పటివరకు క్రీజులో కుదురుకుంటూ ఆడిన సుందర్.. లయన్ బౌలింగ్ లో స్లిప్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రికార్డు స్థాయిలో ఎనిమిదో వికెట్ వీరిద్దరూ నమోదు చేసిన 127 పరుగుల భాగస్వామ్యానికి తెరపడిది. ఆ తర్వాత వచ్చిన బుమ్రా కూడా నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఈ దశలో పదో వికెట్ గా బరిలోకి దిగిన మహ్మద్ సిరాజ్ ప్రేక్షకుల్లో టెన్షన్ రేపాడు. అంతగా బ్యాటింగ్ రాని సిరాజ్ తను ఆడిన మూడు బంతుల్ని బాగా ఎదుర్కోవడంతో నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న నితీశ్ కూడా అభినందించాడు. ఆ తర్వాత 99 పరుగులతో క్రీజులోకి వచ్చిన నితీశ్.. బౌండరీతో తన దైన శైల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆసీస్ గడ్డపై సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుల్లో మూడో భారత ప్లేయర్ గా నిలిచాడు. గతంతో సచిన్ (18 ఏళ్లు), పంత్ (21 ఏళ్లు) అతని కంటే పిన్న వయసులో సెంచరీ చేశారు. సెంచరీ తర్వాత తన బ్యాట్ పై హెల్మెట్ ను పెట్టి, దాన్ని గ్రౌండ్ లో పెట్టి, జెండా పాతినట్లు గెశ్చర్ ఇచ్చాడు. దానిని జాతీయ జెండాగా భావించి, సెల్యూట్ కూడా కొట్టాడు. దీన్ని చూసిన స్టేడియంలోని ప్రేక్షకులతోపాటు మ్యాచ్ ను వీక్షించిన కోట్లాదిమంది అభిమానులు పులకరించి పోయారు. ఇక వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆటను చివర్లో ఆపేశారు. అప్పటికి భారత్ 9 వికెట్లకు 358 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ కంటే ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది.