Rishabh Pant News: తప్పుడు షాట్ సెలెక్షన్ తో మెల్ బోర్న్ టెస్టులో ఔటైన భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఫైరయ్యాడు. అతని షాట్ సెలెక్షన్, డెడికేషన్ పై మండి పడ్డాడు. కీలకమైన నెంబర్ 5 లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి షాట్లు ఏంటని విమర్శించాడు. ఇక బాక్సింగ్ డే టెస్టులో భారత్ మరోసారి వెనుకంజలో నిలిచింది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా ఒక దశలో 221/7తో నిలిచి ఆసీస్ కు భారీ ఆధిక్యం సమర్పించుకునే స్థితిలో నిలిచింది. ఓవర్ నైట్ బ్యాటర్లు పంత్ (28), రవీంద్ర జడేజా (17) త్వరగానే వెనుదిరిగారు. ఈ దశలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (119 బంతుల్లో 85 బ్యాటింగ్, 8 ఫోర్లు, 1 సిక్సర్), స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (115 బంతుల్లో 40 బ్యాటింగ్, 1 ఫోర్) జట్టును ఆదుకున్నారు.
ఆ స్థానానికి పనికిరాడు..
ఇక బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పంత్ ఔటైన విధానం గురించి గావస్కర్ విమర్శించాడు. ఈ ఇన్నింగ్స్ లో కీలకమైన 5వ నెంబర్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చూపించాల్సినంత వాడిని పంత్ లో కరువైందని పేర్కొన్నాడు. లాంగ్ ఆఫ్ దిశగా బౌండరీలు బాదడం లేదా స్కూప్ షాట్లతో పరుగులు రాబట్టడం ఇలా మాత్రమే పంత్ ఆడుతున్నాడని, ఈ విధమైన ఆటతీరుతో స్థిరంగా పరుగులు సాధించలేమని గుర్తు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో పంత్ సాధించిన పరుగులు లక్కీగా వచ్చాయన్నాడు. ఇలా దూకుడుగా ఆడతానిన నిర్ణయించుకున్నట్లయితే లోయర్ మిడిలార్డర్ లో రావాలని, ఐదో నెంబర్లో ఆడటం సరికాదని విమర్శించాడు. ఇక ఫిఫ్టీని సెంచరీగా కన్వర్ట్ చేసే రేట్ పంత్ కేవలం 19 శాతం ఉందని, ఇది నెం.5 స్థానంలో ఆడటానికి ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించాడు. ఈ ఇన్నింగ్స్ లో బోలాండ్ బౌలింగ్ లో తన దైన శైలిలో లెగ్ సైడ్ దిశగా స్వీచ్ షాట్ ఆడాలని పంత్ భావించగా, అది ఎడ్జ్ తీసుకుని బౌండరీ వద్ద ఉన్న లయన్ చేతుల్లో పడింది. ఫీల్డర్ ఉన్నప్పుడు ఇలాంటి ఆటతీరు సరికాదని కూడా గావస్కర్ పేర్కొన్నాడు.
రాణించిన నితీశ్, సుందర్
మూడో రోజు జట్టు కష్టాల్లో ఉన్న దశలో నితీశ్, వాషింగ్టన్ జంట ఆదుకుంది. అబేధ్యమైన ఎనిమిదో వికెట్ కు 105 పరుగులు జోడించి, ప్రత్యర్థికి చెక్ పెట్టింది. ఈ జంటను విడదీసేందుకు కెప్టెన్ కమిన్స్ ఎంతమంది బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. సుందర్ సమయోచితంగా ఆడగా, నితీశ్ మాత్రం దూకుడుగా ఆడి కెరీర్లో తొలి అర్థం సెంచరీ పూర్తి చేసుకుని, సెంచరీ దిశగా ప్రయాణం కొనసాగిస్తున్నాడు. టీ విరామానికి ముందు వర్షం పడటంతో కాస్త ఎర్లీగా బ్రేక్ తీసుకున్నారు. అప్పటికి భారత్ స్కోరు 97 ఓవర్లలో 7 వికెట్లకు 326 పరుగులు చేసింది. ప్రస్తుతం ప్రత్యర్థి కంటే ఇంకా 148 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక మళ్లీ వర్షం పడే అవకాశముండటంతో ఈ రోజులో మొత్తం ఓవర్ల కోటా పూర్తి చేసే అవకాశం లేదు. బౌలర్లలో బోలాండ్ కు మూడు, కమిన్స్ కు రెండు వికెట్లు దక్కాయి. ఇక ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగుల భారీ స్కోరు చేసింది. స్టీవ్ స్మిత్ 140 పరుగుల భారీ సెంచరీ చేశాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో రాణించాడు.