Cheteshwar Pujara Retires from All formats: భారత సీనియర్ క్రికెటర్ చేతేశ్వర్ పుజారా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు పుజారా. తన క్లాసికల్ టెక్నిక్, డిఫెన్స్‌కు పేరుగాంచిన పుజారా 15 ఏళ్లకు పైగా భారతదేశ టెస్ట్ బ్యాటింగ్ లైనప్‌లో కీలకపాత్ర పోషించాడు. గత కొంతకాలం నుంచి టెస్ట్ జట్టులోనూ అతడికి స్థానం దక్కడం లేదు.
చివరిసారిగా పుజారా 2023 జూన్‌లో లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్‌లో భారతదేశం తరపున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో భారత జట్టు కోసం పుజారా చేసిన కృషిని తాజా, మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. తన తరానికి చెందిన అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పుజారా నిలిచాడు.
చేతేశ్వర్ పుజారా 2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసి అంతర్జాతీయ క్రికెట్ మొదలుపెట్టాడు. కీలక సమయంలో ఇన్నింగ్స్‌లను నిలబెట్టే సామర్థ్యం, ఒత్తిడిలోనూ పరుగులు సాధించడం ద్వారా తక్కువ సమయంలోనే గుర్తింపు పొందాడు. రాహుల్ ద్రావిడ్ తరువాత భారత మిడిలార్డర్ కు వెన్నెముకగా నిలిచాడు. అనేక చారిత్రాత్మక భారత విజయాలలో, సవాళ్లతో కూడిన విదేశీ పిచ్‌లలో అతడి ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించాయి.
'అది నిజంగా ఏమిటో మాటల్లో చెప్పలేను'
తన కెరీర్‌లో, పుజారా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి విదేశీ గడ్డ మీద ల్యాండ్‌మార్క్ టెస్ట్ సిరీస్ విజయాలను సాధించడంలో అనేక సెంచరీలు, కీలకమైన ఇన్నింగ్స్‌లను సాధించాడు. పుజారా రిటైర్మెంట్ భారతదేశ టెస్ట్ క్రికెట్‌కు ఒక శకానికి ముగింపు పలికింది, ఇది పట్టుదల, నిబద్ధతను తరువాతి తరానికి వారసత్వంగా వదిలివెళ్తాడు.
చేతేశ్వర్ పుజారా కెరీర్
చేతేశ్వర్ పుజారా భారత్ తరపున 103 టెస్ట్ మ్యాచ్‌లు, 5 వన్డేలలో ప్రాతినిథ్యం వహించాడు. టెస్ట్‌లలో పూజారా మొత్తం 7,195 పరుగులు చేశాడు. సుదీర్ఘ కెరీర్‌లో టెక్నిక్ బ్యాటర్ పుజారా 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 3 డబుల్ సెంచరీలు సాధించగా, , అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 206. టీమిండియాలో అత్యంత నమ్మదగిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో ఒకరిగా పూజారా నిరూపించుకున్నాడు.
వన్డే ఫార్మాట్‌లో పూజారాకు అంతగా అవకాశాలు రాలేదు. వన్డేల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో మాత్రం తనదైన శైలి, బ్యాటింగ్‌తో చెరగని ముద్రవేశాడు. కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్ కు దిగి జట్టు స్కోరు బోర్డును నడిపించే ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు పుజారా ఖాతాలో ఉన్నాయి. దశాబ్దంన్నరకు పైగా టీమిండియా టెస్ట్ బ్యాటింగ్ లైనప్ మిడిలార్డర్‌కు మూలస్తంభంగా నిలిచాడు. గత రెండేళ్లుగా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దాంతో ఈ భారత బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు.