Shubman Gill In 450 Crore Chit Fund Scam: భారత క్రికెటర్లు శుభమాన్ గిల్, మోహిత్ శర్మల కి గుజరాత్ సీఐడి క్రైంబ్రాంచి పోలీసులు సమన్లు పంపనున్నారు. రూ.450 కోట్ల కుంభకోణానికి సంబంధించి అతడిని విచారించేందుకు సమన్లు పంపనున్నట్లు తెలిపారు. అతనితోపాటు రాహుల్ తెవాటియా, ఆర్ సాయి సుదర్శన్ లకు కూడా సమన్లు పంపనున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ కు గత సీజన్లో ప్రాతినిథ్యం వహించారు. తాజాగా గుజరాత్ లో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పోంజి స్కామ్ తరహాలో ఈ కుంభకోణం జరిగిందని తెలుస్తోంది. అయితే పెట్టుబడుల విషయంలో క్రికెటర్లను పోలీసులను ప్రశ్నించనున్నట్లు సమాచారం. దీనితో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. ఈ విషయాలను గుజరాత్ కు చెందిన అహ్మదాబాద్ మిర్రర్ అనే మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. అయితే దీనిపై సదరు క్రికెటర్ల నుంచి ఎలాంటి స్టేట్మెంట్లు ప్రస్తుతానికి బయటకు రాలేదు.
భారీ పెట్టుబడి పెట్టిన గిల్..
ఇక కుంభకోణానికి ప్రధాన సూత్రధారి భూపేంద్ర సింగ్ జాలాను అరెస్టు చేసి, పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో పలు కీలక విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. జాలా అనేక అనధికార ఖాతాలను నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ లావాదేవీలను రిషిక్ మెహతా నిర్వహించాడని గుర్తించామని తెలిపారు. అతను చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడినట్లు తేలిస్తే, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. ఇక, ఈ కుంభకోణానికి సంబంధించి సోమవారం పలు ప్రాంతాల్లో దాడులు జరిపి, అనేక కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక అనధికార ఖాతా బుక్ లో రూ.52 కోట్లకు సంబంధించిన లావాదేవీలను గుర్తించామని పోలీసులు వెల్లడించారు. దీనిని బట్టి ఈ కుంభకోణం రూ.450 కోట్లకు పైబడిందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు అకౌంటెంట్లతో కలిసి అనధికార ఖాతాలను విచారిస్తున్నామని, దీంతో ఈ కుంభకోణం విలువ మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
తొలుత రూ.6వేల కుంభకోణమని వెల్లడి..
మరోవైపు కుంభకోణాన్ని విచారించిన పోలీసులు.. తొలుత ఇది రూ.6వేల కోట్లకు పైబడిన కుంభకోణమని తేల్చారు. అయితే ఇప్పటివరకు రూ.450 కోట్లకు సంబంధించిన లావాదేవీల జాడను గమనించినట్లు సమాచారం. ఈక్రమంలోనే భారత క్రికెటర్లు గిల్, మోహిత్ శర్మలతోపాటు ఇతరులను విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. క్రికెటర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి చెల్లించడంతో జాలా విఫలమయ్యాడని, ఈ విషయంలో క్రికెటర్లను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. లావాదేవీల వివరాలను, చెల్లింపుల గురించి కూడా పలు ప్రశ్నలకు పోలీసులు సంధించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మూడు ఫార్మాట్లలో భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న గిల్.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే సిడ్నీలో శుక్రవారం నుంచి జరిగే ఐదో టెస్టులో అతడిని టీమ్ లో ఆడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Also Read: Bumrah News: మరో రికార్డుపై బుమ్రా కన్ను.. టెస్టుల్లో విజయవంతమైన భారత బౌలర్ గా నిలిచేందుకు గురి.. మరో ఆరు వికెట్లు సాధిస్తే రికార్డు