Aus Vs Ind 5th Test News: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం టీమిండియా 1-2తో వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో ఈ టెస్టులో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అంచనాలకు తగినట్లుగా రాణించకపోవడంతో అతనిపై వేటు వేయాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి గత పర్యటనలో అతను కీలక ఇన్నింగ్స్ ఆడి భారత జట్టు రెండోసారి సిరీస్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈసారి మాత్రం అతను తేలిపోయాడు. అలాగే పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేయలేక, వికెట్లు పారేసుకుంటుండటంపైనా మేనేజ్మెంట్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
అంతంతమాత్రంగానే..
భారీ అంచనాలతో ఈ సిరీస్ లోకి అడుగు పెట్టిన రిషబ్.. అంచనాలు ఏమాత్రం అందుకోలేదు. ఇప్పటివరకు 4 టెస్టులాడిన అతను 7 ఇన్నింగ్స్ లో కలిపి 165 పరగులే చేశాడు. అతని సగటు కేవలం 22 ఉండగా, అత్యధిక స్కోరు 37 పరుగులే కావడం గమనార్హం. తొలి టెస్టు నుంచి వరుసగా 37,1,21,28, 9, 28, 30 పరుగుల స్కోర్లు నమోదు చేశాడు. ఇక, మెల్ బోర్న్ టెస్టులో కీలక సమయంలో చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకుని, జట్టు ఓటమికి కారణమయ్యాడని ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అతని స్థానంలో ధ్రువ్ జురెల్ ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తను సమయోచితంగా ఆడుతాడని, ఇప్పటికే ఇంగ్లాండ్ సిరీస్ తో పాటు ఇటీవల ఆస్ట్రేలియా పర్యటించిన ఇండియా ఏ తరపున సత్తా చాటాడు. అయితే తొలి టెస్టులో తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 12 పరుగులే చేసి జట్టులో చోటు కోల్పోయాడు. అయితే ఇతడిని పంత్ కు ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తే ఎలా ఉంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఎందుకంటే ఇండియా-ఏ తరపున రెండు ఇన్నింగ్స్ ల్లోనూ అర్థ సెంచరీలు బాది, సత్తా చాటాడు. ఏదేమైనా టాస్ ముందు వరకు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి..
మరోవైపు భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ పనితీరును బీసీసీఐ సమీక్షిస్తోందన్న కథనాలు సంచలనం రేపాయ. ఈ టెస్టు సిరీస్ తర్వాత మరో మేజర్ టోర్నీ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వరకు జట్టు ప్రదర్శనలో మార్పు రాకపోతే గంభీర్ ను కూడా సాగనంపే అవకాశముందని తెలుస్తోంది. అలాగే కోచింగ్ స్టాఫ్ పైనా, సెలెక్షన్ కమిటీని కూడా రద్దు చేసే అవకాశమున్నట్లు సమాచారం. నిజానికి విదేశీ మాజీలు భారత ఫుట్ టైమ్ కోచ్ గా ఉండటానికి ఆసక్తి చూపకపోవడంతో, రాజీ పడి గంభీర్ ను కోచ్ గా బోర్డు ఎంపిక చేసిందని తెలుస్తోంది. తను ఫస్ట్ చాయిస్ కోచ్ కాదని, వేరే మాజీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో తనను ఎంపిక చేసినట్లు బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక గంభీర్ హయాంలో భారత్ ఘోర పరాజయాలు చవిచూస్తోంది. శ్రీలంకతో దశబ్ధాల తర్వాత వన్డే సిరీస్ ఓడిపోయింది. అలాగే సొంతగడ్డపై దశబ్ధాలుగా కనీసం టెస్టు మ్యాచ్ గెలవని, న్యూజిలాండ్ కు ఏకంగా టెస్టు సిరీస్ ను 0-3తో వైట్ వాస్ తో సమర్పించుకుంది. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన నాలుగు టెస్టుల్లో రెండింటిలో ఓడి, ఒకటి డ్రా చేసుకోగా, ఒకదాంట్లో గెలుపొందింది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఏదేమైనా మరో రెండు నెలల్లో గంభీర్ భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశముంది.