India W vs Pakistan W CWG T20: భారత్‌, పాకిస్థాన్‌ మహిళల టీ20 మ్యాచ్‌ బర్మింగ్‌హామ్‌లో జరుగుతుంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్‌ మొదలవ్వాలి. అరగంట ముందు టాస్‌ వేస్తారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. మూడు గంటలకు టాస్ వేయాలి, కానీ వర్షం కారణంగా, గ్రౌండ్ నుంచి కవర్స్ తొలగించలేదు. అంపైర్లు టాస్ వేయడం ఆలస్యమైంది. మరికొంత సమయం తర్వాత ఫీల్డ్‌ను చెక్ చేసి టాస్ వేయనున్నారు.


కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల క్రికెట్ తొలిసారి జరుగుతోంది. నేడు దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. దాంతో నేడు జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌‌లో ఎలాగైనా నెగ్గాలన్న పట్టుదలతో భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. అంతర్జాతీయ వేదికపై భారత్‌, పాకిస్థాన్‌ ఏ ఆటలో తలపడినా అభిమానులు ఆసక్తిగా చూస్తుంటారు. 


బర్మింగ్‌హామ్‌ వేదికగా కామన్వెల్త్ గేమ్స్‌లో తమ రెండో మ్యాచ్‌లో టీమిండియా, పాక్ ను ఢీకొడుతోంది. మామూలుగానే భారత్, పాక్ మ్యాచ్ అంటే ఆసక్తి ఉంటుంది. అందులోనూ ప్రతిష్టాత్మక టోర్నీలో మ్యాచ్ కావడం, ఆదివారం జరగుతుండగంతో మరింత ఆసక్తి నెలకొంది. పైగా ఈ ఆటలో పాక్ మీద భారత అమ్మాయిలదే పైచేయి. చివరి ఐదు మ్యాచులో టీమ్‌ఇండియా నాలుగు గెలిస్తే పాక్‌ ఒక్కటే గెలిచింది.






ఈ మ్యాచ్ ఎక్కడెక్కడ చూడొచ్చంటే 
భారత్‌, పాక్‌ మ్యాచును దూరదర్శన్‌ స్పోర్ట్స్‌, సోనీ ఛానళ్లలో వీక్షించొచ్చు. టెన్‌ స్పోర్ట్స్‌లోనూ వస్తుంది. భారత్‌, పాక్‌ టీ20 మ్యాచును లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. సోనీ లైవ్‌లో సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు నేరుగా లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి. జియో టీవీలో ఉచితంగా చూడొచ్చు.






తక్కువ స్కోర్ల మ్యాచ్‌లే..
రెండు జట్ల మధ్య మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదు కాలేదు. 2018 టీ20 వరల్డ్ కప్ లో భారత్ అత్యధికంగా 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. 2012 ఆసియా కప్ లో పాక్ మహిళల జట్టు చేసిన 63 పరుగులే ఇప్పటివరకూ దాయాది జట్ల మధ్య అత్యల్ప స్కోర్.