2nd T20 IND vs ZIM India Innigs: తెలుగు కుర్రాడు అభిషేక్‌ శర్మ(Abhishek Sharma)... అంతర్జాతీయ క్రికెట్‌(Internationa Cricket)లో తొలి అడుగు బలంగా వేశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున అదిరిపోయే ఇన్నింగ్స్‌లతో చెలరేగిన ఈ కుర్రాడు.. టీ 20 క్రికెట్‌లో రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే శతక గర్జన చేశాడు. తొలి మ్యాచ్‌లో కనీసం  116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక తడబడ్డ భారత జట్టుకు.. భారీ స్కోరు చేసేలా చేశాడు. అడుతున్నది పసికూన జింబాబ్వే(ZIM)తోనే అయినా వారి బౌలింగ్ చాలా బాగుంది. ఆ విషయం మనకు తొలి మ్యాచ్‌లోనే తెలిసిపోయింది. అదీ కాక తొలి టీ 20లో బ్యాటింగ్‌తో పర్వాలేదనిపించిన సారధి గిల్‌ రెండు పరుగులే చేసి పెవిలియన్‌కు చేరిన వేళ... అభిషేక్‌ శర్మ అదరగొట్టేశాడు. జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోసి శతకం సాధించేశాడు. ఆడుతున్న రెండో మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీతో టీమిండియాలో స్థానాన్ని సుస్ధిరం చేసుకునే దిశగా తొలి అడుగు వేసేశాడు. కేవలం 41 బంతుల్లో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో అభిషేక్ సరిగ్గా సెంచరీ చేశాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌, రింకూసింగ్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. 






 

దొరికేశాడా ఓపెనర్‌

టీమిండియా ఓపెనర్‌, సారధి రోహిత్‌ శర్మ టీ 20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. విరాట్‌ కోహ్లీ, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా వీడ్కోలు పలికారు. ఇక యువ ఆటగాళ్లు ఆ స్థానాలను భర్తీ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సంధి దశలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత్‌కు తొలి మ్యాచ్‌లో దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. జింబాబ్వే నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేక విమర్శలు ఎదుర్కొంది. ఈ దశలో రెండో టీ 20 మ్యాచ్‌కు సిద్ధమైన భారత్‌కు... శుభ్‌మన్‌ గిల్‌ తక్కువ పరుగులకే వెనుదిరగడంతో షాక్‌ తగిలింది. అయితే అభిషేక్‌ శర్మ వెనక్కి తగ్గలేదు. జింబాబ్వే బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి చెలరేగిపోయాడు. పసికూన బౌలర్లను కసితీరా బాదేశాడు. ఇక ఈ ఇన్నింగ్స్‌తో తన పేరు మార్మోగేలా చేశాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా సెలెక్టర్లకు స్పష్టమైన సందేశం పంపాడు. రెండో మ్యాచ్‌లోనే సెంచరీ చేసేసి అతి తక్కువ మ్యాచ్‌లు ఆడి శతకం చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. మేయర్స్‌ వేసిన పదకొండో ఓవర్‌లో అభిషేక్‌ షేక్‌ ఆడించాడు. ఆ ఓవర్లో మొత్తం 28 పరుగులు రాబట్టాడు. ఆ ఓవర్‌లో అభిషేక్ రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదేశాడు. అంతేనా మసకద్జ వేసిన 14వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లు బాది చెలరేగిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా అనుభవం ఉన్న  ఆటగాడిలా అభిషేక్‌ ఇన్నింగ్స్‌ సాగింది. ఇదే దూకుడు, ఆటతీరు మరి కొంతకాలం కొనసాగిస్తే అభిషేక్‌... జట్టులో స్థానం సుస్థిరమైనట్లే.

 

భారత్‌ భారీ స్కోరు

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్‌ 100 పరుగులు చేయగా రుతురాజ్‌ గైక్వాడ్‌ 47 బంతుల్లో 77 పరుగులు చేశాడు. చివర్లో రింకూ సింగ్‌ మెరుపు బ్యాటింగ్ చేశాడు. రింకూసింగ్‌ 22 బంతుల్లో 48 పరుగలు చేశాడు.