Virat Kohli: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ నేడు తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నాడు. 2008లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ రన్ మిషీన్.. నేడు తన సుదీర్ఘ కెరీర్‌లో 500వ మ్యాచ్ ఆడనున్నాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ ఓవల్ పార్క్ ఇందుకు వేదిక కానుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లలో కోహ్లీ పదోవాడు కాగా భారత్ నుంచి నాలుగో క్రికెటర్‌గా కొత్త రికార్డులు సృష్టించబోతున్నాడు.
ఇప్పటివరకూ 499 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. మూడు ఫార్మాట్లలో కలిపి ఓవరాల్‌గా 53.48 సగటుతో 25,461 పరుగులు సాధించాడు. 110 టెస్టులు, 115 టీ20లు, 274 వన్డేలు ఆడిన కోహ్లీ.. తన కెరీర్‌లో 75 సెంచరీలు చేశాడు. వందో టెస్టు ఆడనున్న కోహ్లీకి బీసీసీఐ స్పెషల్ ట్రిబ్యూట్ ఇచ్చింది. ఓ ప్రత్యేక పోస్టర్‌ను రూపొందిస్తూ.. ‘కోహ్లీ ప్రయాణాన్ని ప్రశంసించడానికి 500 కారణాలు.. భారత్ తరఫున 500వ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీకి కంగ్రాట్యులేషన్స్..’ అని ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.
కోహ్లీ జర్నీపై భారత మాజీ క్రికెటర్లు అతడికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్.. రెండో టెస్టుకు ముందు విలేకరులతో మాట్లాడుతూ.. కోహ్లీ ప్రస్తుత టీమ్‌లో చాలా మంది ఆటగాళ్లతో పాటు దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని ప్రశంసించాడు. ‘కోహ్లీకి ఇది 500వ గేమ్ అని నాకు తెలియదు. నేను ఆ నెంబర్ల విషయంలో చాలా వీక్. కోహ్లీ జర్నీ అద్భుతం. అతడు చాలామందికి స్ఫూర్తి. ప్రస్తుతం టీమ్‌లో ఉన్నవారితో పాటు దేశంలోని యువతకు కూడా కోహ్లీ స్ఫూర్తినిస్తున్నాడు. అతడేంటో అతడి గణాంకాలే చెబుతున్నాయి. అవన్నీ చరిత్రలో నిక్షిప్తమై ఉన్నాయి. నావరకు కోహ్లీ అంటే అతడి హార్డ్ వర్కే గుర్తొస్తుంది. కోహ్లీ చేసే కఠోర శ్రమ ఎవరికి కనిపించకపోవచ్చు గానీ అతడి ఆట దానిని ప్రపంచానికి చెబుతోంది..’అని ద్రావిడ్ అన్నాడు.
భారత్ తరఫున ఐదు వందల మ్యాచ్‌లు ఆడినవారిలో నాలుగోవాడు. ఈ జాబితాలో సచిన్ (664 మ్యాచ్‌లు), ఎంఎస్ ధోని (538 మ్యాచ్‌లు), రాహుల్ ద్రావిడ్ (509 మ్యాచ్‌లు) ముందున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ తర్వాత జయవర్దెనే (653), కుమార సంగక్కర (594 మ్యాచ్‌లు) టాప్-3లో ఉన్నారు.
ఇండియా - వెస్టిండీస్‌కు వందో టెస్టు..
నేటి నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ ఓవల్ పార్క్ వేదికగా జరుగబోయే భారత్ - వెస్టిండీస్ రెండో టెస్టు.. ఈ ఇరు జట్ల మధ్య వందో టెస్టు కానుంది. విండీస్‌తో భారత్ 99 మ్యాచ్‌లు ఆడగా ఇందులో 30 టెస్టులను వెస్టిండీస్ గెలుచుకోగా భారత్ 23 మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. 46 మ్యాచ్‌లు డ్రా గా ముగిశాయి. 2002 తర్వాత ఇండియా, వెస్టిండీస్‌లలో జరిగిన ఏ టెస్టు సిరీస్‌లో కూడా టీమిండియా ఓడిపోలేదు. 21 ఏండ్లుగా భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial