India vs Sri Lanka Updates: ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్- శ్రీలంక జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ వరల్డ్‌ కప్‌లో భారత్‌ రెండో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేయనుంది. 


ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీఫైనల్‌లోకి ప్రవేశించాలని టీమిండియా ప్లాన్‌తో ఉంది. మ్యాచ్‌లో ఓడిపోతే టోర్నీ నుంచి వైదొలగే ప్రమాదం ఉన్నందున శ్రీలంక కూడా ఎలాగైనా విజయం సాధించాలన్న కసితో ఉంది. ఇప్పటి వరకు అపజయం లేకుండా సాగుతున్న టీమిండియా జర్నీలో స్పీడ్‌కు చిన్న బ్రేక్ ఇవ్వాలని శ్రీలంక ఎదురు చూస్తోంది. ఇప్పటి వరకు శ్రీలంక ఆడిన ఆరు మ్యాచుల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది.


ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో విజయంపై కన్నేసింది. ఈ మహా సంగ్రామంలో ఆడిన ఆరు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రోహిత్‌ సేన.. శ్రీలంకను ఢీ కొట్టబోతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. భారీ స్కోరును శ్రీలంకకు నిర్దేశించాలని ఫిక్స్ అయింది. అందుకే జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. 


2011 ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడిన తర్వాత తొలిసారి భారత్‌-శ్రీలంక తలపడబోతున్నాయి. కానీ 2011 ప్రపంచకప్‌లో శ్రీలంక-భారత్‌ సమఉజ్జీలుగా ఉండగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో ఊపు మీదుండగా.. శ్రీలంకను వరుస పరాజయాలు వీడడం లేదు. రోహిత్‌ సేన ఆడిన ఆరు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. లంకేయులు మాత్రం ఆడిన ఆరు మ్యాచుల్లో రెండే విజయాలు, నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో దిగువ స్థానంలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియాకు అసలు శ్రీలంక కనీస పోటీ ఇవ్వగలుగుతుందో లేదో చూడాలి. ఈ మ్యాచ్‌లో గెలిచి అధికారికంగా.. ఎలాంటి సమీకరణాలపై ఆధారపడకుండా సెమీస్‌ చేరాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. 
 


శ్రీలంక పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గాయాలు, కీలక ఆటగాళ్ళు దూరంగా కావడం వంటి సమస్యలతో లంక సతమతమవుతోంది. సమరవిక్రమ ఆరు మ్యాచుల్లో  ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో 331 పరుగులు చేసి లంక బ్యాటర్లలో అత్యధిక పరుగులు చేశాడు. పాతుమ్ నిస్సంక కూడా గిల్ తర్వాత ఈ ఏడాది వెయ్యికి పైగా వన్డే పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ప్రపంచ కప్‌లో నిస్సంకకు నాలుగు వరుస అర్ధసెంచరీలు ఉన్నాయి. 


శ్రీలంక జట్టులో ఒక మార్పు చేసింది. ధనుంజయ డిసిల్వా స్థానంలో దుషాన్ హేమంతకు చోటు కల్పించింది. గత మ్యాచ్‌లో ఆడిన ప్లేయర్లతోనే టీమిండియా బరిలో దిగుతోంది. 


భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.


శ్రీలంక జట్టు: పథమ్ నిశాంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్ (కెప్టెన్/ వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అస్లంకా, దుషన్ హేమంత, ఏంజెలో మాథ్యూస్, మహిష్ తిక్ష్నా, కసున్ రజిత, దుష్మంత చమీరా, దిల్షాన్ మదుశంక