Kohli game on  Final with  Sa:  కోహ్లీ శక్తినంత ఫైనల్‌ కోసం దాచి పెట్టాడనుకుంటా... సెమీఫైనల్లో గెలిచిన అనంతరం విరాట్‌ కోహ్లీపై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యలు నిజమేనని విరాట్‌ కోహ్లీ తన బ్యాట్‌తో మరోసారి నిరూపించాడు. వరుసగా విఫలమవుతున్నా కోహ్లీని జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారంటూ వచ్చిన విమర్శలకు కీలకమైన ఫైనల్‌లో విరాట్ విశ్వరూపం చూపాడు. 35 పరుగులు కూడా దాటకముందే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియా(India)కు కోహ్లీ ఆపద్భాందవుడిలా మారాడు. ఆరంభంలో ధాటిగా ఆడినా వరుసగా వికెట్లు పడడంతో కోహ్లీ సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి మళ్లీ టీమిండియాను పోటీలోకి తెచ్చాడు. కోహ్లీ- అక్షర్‌ పటేల్‌ భాగస్వామ్యంతో టీమిండియా మళ్లీ దక్షిణాఫ్రికా(SA) బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించింది.

 

కోహ్లీ ఇన్నింగ్స్ కీలకం

35 పరుగులు కూడా దాటకుండానే మూడు వికెట్లు కోల్పోవడంతో ఈ ప్రపంచకప్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ లైనప్‌ ఉన్న దక్షిణాఫ్రికా... భారత్‌పై ఒత్తిడి పెంచాలని వ్యూహం పన్నింది. ఆ దశలో మరో వికెట్‌ పడితే టీమిండియాపై నిజంగానే ఒత్తిడి పెరిగేది. కానీ కోహ్లీ ఆ సమయంలోనే గేర్‌ మార్చాడు. మరో వికెట్‌ పడకుండా... కోహ్లీ సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. ఓ వైపు అక్షర్‌ పటేల్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండగా మరోవైపు కోహ్లీ యాంకర్‌ పాత్ర పోషించాడు. స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ భారత్‌పై ఒత్తిడి పెరగకుండా చూశాడు. స్ట్రైక్‌ రేట్‌ తక్కువగా ఉన్నా ఆ సమయంలో వికెట్‌ పడకుండా ఉంటే సవాల్‌ విసిరే లక్ష్యం సాధ్యమని అనిపించింది. అందుకే కోహ్లీ బంతికో పరుగు తీస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఎప్పుడైతే 50 పరుగుల మార్కును దాటాడో తన మార్క్‌ షాట్లతో కోహ్లీ అలరించాడు. రబాడ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్‌ అయితే కోహ్లీని ఎందుకు కింగ్‌ అంటారో చెప్పేలా అనిపించింది. రోహిత్ శర్మ, రిషభ్‌ పంత్‌, సూర్య కుమార్‌ యాదవ్‌ అవుట్‌ అయిన దశలో కోహ్లీ ఈ కీలక ఇన్నింగ్స్‌  ఆడడం గమనార్హం. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఊబిలో చిక్కుకున్న టీమిండియాను కోహ్లీ బయటపడేశాడు. సెమీఫైనల్‌ వరకూ అన్ని మ్యాచుల్లో వరుసగా విఫలమైన కోహ్లీ.... భారమంతా తనపైనే ఉన్నప్పుడు మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. మిడిల్‌ ఆర్డర్‌లో కీలకమైన 76 పరుగులు చేసి టీమిండియాకు గెలిచే అవకాశాలను సృష్టించాడు. అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబేతో కలిసి కోహ్లీ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

 

భారం ఇక బౌలింగ్‌పైనే

ఈపిచ్‌పై లక్ష్య ఛేదన కష్టమని భావిస్తున్న టీమిండియా నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం సౌతాఫ్రికాకు అంత తేలికగా ఉండకపోవచ్చు. బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్‌ దళం ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో ఎన్నో అద్భుతాలు సృష్టించింది. మరోసారి స్పిన్నర్లు చెలరేగితే టీమిండియా జగజ్జేతగా నిలవడం ఖాయం.