సఫారీ గడ్డపై కీలక మ్యాచ్‌కు టీమిండియా(Team India) సిద్ధమైంది. వన్డే సిరీస్‌(One Day International)లో ఆఖరి సమరానికి భారత్‌-దక్షిణాఫ్రికా(South Africa) సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఒడిసిపట్టాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. టీమిండియా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. టీమిండియా సఫారీ గడ్డపై చివరిసారి 2018లో వన్డే సిరీస్‌ గెలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకూ సిరీస్‌ గెలవలేదు. అయిదేళ్ల తర్వాత మళ్లీ వన్డే సిరీస్‌ గెలవాలని రాహుల్‌ సేన భావిస్తోంది. నిర్ణయాత్మకమైన ఈ చివరి మ్యాచ్‌లో ఓపెనర్ల నుంచి భారత మేనేజ్‌మెంట్‌ బలమైన ఆరంభాన్ని కోరుకుంటోంది. రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad), సాయి సుదర్శన్(Sai Sudharsan) బలమైన ఆరంభం ఇస్తే దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టొచ్చని భారత జట్టు భావిస్తోంది. తొలి రెండు మ్యాచుల్లో 55, 62 పరుగులతో ఆకట్టుకున్న సాయి సుదర్శన్‌ మరోసారి మంచి ఇన్నింగ్స్‌ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. సాయికి రుతురాజ్‌ గైక్వాడ్ అండగా నిలిస్తే వన్డే సిరీస్‌ గెలవడం టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదు.


ఆందోళనకరంగా మిడిల్ ఆర్డర్


ఓ వైపు టీమిండియా ఓపెనర్లు త్వరగా అవుట్‌ అవుతుండగా... రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఓపెనర్లు 130 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. టోనీ డి జోర్జి(Tony de Zorzi) అద్భుత సెంచరీతో మెరిశాడు. గత రెండు మ్యాచుల్లో తిలక్ వర్మ(Tilak Varma) విఫలం కావడం టీమిండియా మేనెజ్‌మెంట్‌ను ఆందోళన పరుస్తోంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్‌లో రాణించిన తిలక్‌ వర్మ వన్డేల్లో విఫలమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రుతారజ్‌ గైక్వాడ్, తిలక్‌ వర్మలకు ఈ మ్యాచ్‌ చాలా కీలకంగా మారింది. మిడిలార్డర్‌ కూడా భారత్‌ను ఆందోళన పరుస్తోంది. మ్యాచ్‌ జరిగే బోలాండ్ పార్క్(Boland Park ) పిచ్  బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనాలతో బ్యాటర్లు మెరుగ్గా రాణించాలని భావిస్తున్నారు. గత మ్యాచ్‌లో 12 పరుగులకే అవుట్ అయిన సంజూ శాంసన్‌(Sanju Samson) ఈ మ్యాచ్‌లో భారీ స్కోరుపై కన్నేశాడు.


యుజ్వేంద్ర చాహల్‌కు ఛాన్స్ 


మూడో వన్డే(Third ODI)కు ముందు భారత్ బౌలింగ్ విభాగం ఆందోళన పరుస్తోంది. తొలి వన్డేలో అద్భుతంగా రాణించిన బౌలర్లు... రెండో మ్యాచ్‌లో తేలిపోయారు. ముఖేష్ కుమార్(Mukesh Kumar ) రెండు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh), అవేష్ ఖాన్(Avesh Khan) మొదటి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. కానీ రెండో మ్యాచ్‌లో ఆ ఊపును కొనసాగించలేకపోయారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లను త్వరగా పెవిలియన్‌కు పంపాలంటే మరోసారి భారత పేస్‌ త్రయం విజృంభించాల్సి ఉంది. ముఖేష్ కొత్త బంతితో లయను అందుకుని వికెట్లు తీయడం భారత్‌కు అవసరం. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌(Yuzvendra Chahal)కు చోటు దక్కే అవకాశం ఉంది. విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో మంచి ప్రదర్శన చేసిన చాహల్‌ను జట్టులోకి తీసుకుందే.. అక్షర్‌ పటేల్‌(Axar Patel), కుల్దీప్ యాదవ్‌(Kuldeep Yadav)లలో ఒకరు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. కానీ కుల్దీప్, అక్షర్ ఇద్దరూ టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యారు. ఈ పరిస్థితుల్లో వీరిని జట్టు నుంచి తీసే పరిస్థితి కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డి జోర్జీ ప్రదర్శన ప్రొటీస్‌కు ఊరట కలిగిస్తోంది. అతను మరోసారి రాణించాలని సఫారీ జట్టు కోరుకుంటోంది. ఫాస్ట్ బౌలర్ నాండ్రే బర్గర్ కూడా రాణిస్తుండడం సఫారీలకు సానుకూల అంశం. 



భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఆకాష్ దీప్.



దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్‌క్రమ్‌ (కెప్టెన్), నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, వియాన్ ముల్డర్, బ్యూరాన్ హెండ్రిక్స్. రాస్సీ వాన్ డెర్ డస్సెన్, తబ్రైజ్ షమ్సీ, లిజాద్ విలియమ్స్, కైల్ వెర్రెయిన్.