Bangladesh Cricket News: బంగ్లాదేశ్‌  ఓపెనర్ సౌమ్య సర్కార్‌ చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ గడ్డపై భారీ శతకంతో సచిన్‌ రికార్డును బద్దలు కొట్టాడు. 14 ఏళ్ల పాటు భద్రంగా ఉన్న క్రికెట్‌ గాడ్‌ సచిన్ టెండూల్కర్‌ (Sachin Tendulkar) రికార్డును చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించాడు. భారీ శతకంతో చెలరేగిన సౌమ్య.. ఐదేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 151 బంతుల్లోనే 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 169 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌమ్య.. ఉపఖండం జట్ల తరఫున  న్యూజిలాండ్ గడ్డపై ఒక వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు సచిన్ పేరిట ఈ రికార్డు ఉండేది. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఉపఖండం జట్ల తరపున బ్లాక్‌ క్యాప్స్‌ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా  సౌమ్యా నిలిచాడు.


సచిన్ 2009లో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన వన్డేలో 163 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇదే ఇప్పటివరకూ ఉపఖండం జట్ల తరఫున కివీస్ గడ్డపై ఇప్పటివరకు అత్యధికం స్కోరు. విదేశాల్లో బంగ్లాదేశ్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ ఘనత సాధించాడు. కొన్నాళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సౌమ్యా... భారత్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లోనూ బంగ్లాదేశ్ జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పుడు వచ్చీ రాగానే అదీ న్యూజిలాండ్‌ గడ్డపై చెలరేగాడు.


ఇప్పుడు సౌమ్య ఆ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో సౌమ్య సర్కార్‌..  భారీ శతకం చేసినా బంగ్లా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. సౌమ్య ఒక ఎండ్‌లో ఓపెనర్‌గా ఉన్నా మరే ప్లేయర్ నుంచి సరైన సహకారం లభించలేదు. సౌమ్య విధ్వంసంతో 49.5 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. తర్వాత కివీస్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. 46.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. విల్ యంగ్ (89), రచిన్ రవీంద్ర (45), హెన్రీ నికోల్స్ (95), టామ్ లేథమ్ (34 నాటౌట్), టామ్ బ్లండెల్ (24 నాటౌట్) రాణించారు. దీంతో 3 వన్డేల సిరీస్‌ను.. కివీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకుంది. 


ఇటీవలే బంగ్లాదేశ్(Bangladesh) గ‌డ్డపై జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌(Test Series)లో న్యూజిలాండ్ ( New Zealand) చిరస్మరణీయ విజయం సాధించింది. కీల‌క‌మైన‌ రెండో టెస్టులో అద్భుత విజయంతో సిరీస్‌ను సమం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కివీస్‌ నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజ‌యం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో కివీస్‌ సమం చేసింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ర‌స‌వ‌త్తరంగా సాగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్‌ 40 పరుగులతో అజేయంగా నిలిచి మ‌రోసారి కీల‌క ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించాడు. మిచెల్‌ శాంట్నర్‌ 35 పరుగులతో ధ‌నాధ‌న్ ఆట‌తో అండ‌గా నిలిచాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న వికెట్‌పై ఫిలిప్స్‌, శాంట్నర్‌ అద్బుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. స్వల్ప ఛేద‌న‌లో కేన్ విలియ‌మ్సన్‌(11), డారిల్ మిచెల్(19), టామ్ బండిల్‌(2) చేతులెత్తేశారు. దాంతో, కివీస్ ఓట‌మి ఖాయ‌మ‌నుకున్నారంతా. కానీ, ఫిలిఫ్స్, శాంట్న‌ర్ అద్భుతం చేశారు. వీళ్లిద్దరూ ఏడో వికెట్‌కు 70 ర‌న్స్ జోడించి బంగ్లాదేశ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు.