India vs Pakistan Champions Trophy 2025 Live Updates: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో భారత్ సత్తా చాటింది. బౌలర్లు రాణించడంతో ప్రత్యర్థిని ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేసింది. ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలో గ్రూపు-బిలో భాగంగా దుబాయ్ లో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో టాస్ నెగ్గి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పాక్.. 49.4 ఓవ‌ర్ల‌లో 241 ప‌రుగులకు ఆలౌట్ అయింది. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ సౌద్ ష‌కీల్ (76 బంతుల్లో 62, 5 ఫోర్లు) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. మహ్మద్ రిజ్వాన్ (46) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.  కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా, స్టార్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్య 2 కీలక వికెట్లు తీసి, పొదుపుగా బౌలింగ్ చేశాడు. బంగ్లాతో తొలి మ్యాచ్  ఆడిన అనుభవం ఉన్న భార‌త్.. ఈ మ్యాచ్ లో పక్కా ప్ర‌ణాళిక‌తో బౌలింగ్ చేసింది. క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ చేయ‌డంతో ప‌రుగులు చేయ‌డంలో పాక్ బ్యాట‌ర్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఒత్తిడి పెరిగి అన‌వ‌స‌ర షాట్ల‌కు ప్ర‌య‌త్నించి ఔట‌య్యారు. ఈ మ్యాచ్ లో గెలిస్తే భార‌త్ దాదాపు సెమీస్ కు చేరుకుంటుంది. ఇక డిఫెండింగ్ చాంపియ‌న్స గా బ‌రిలోకి దిగిన పాక్.. ఈ మ్యాచ్ లో ఓడిపోతే ఏకంగా టోర్నీ నుంచే నిష్క్ర‌మిస్తుంది.  

 

 

త‌డ‌బ‌డిన పాక్.. ఈ మ్యాచ్ లో ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ ఆశించినంత వేగంగా ప‌రుగులు చేయ‌లేక‌పోయింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (23) మంచి ట‌చ్ లో క‌న్పించినా, భారీ స్కోరు సాధించేక‌పోయాడు. మ‌రో ఓపెన‌ర్ ఇమాముల్ హ‌క్ (10) కూడా విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో 47 ప‌రుగుల‌కే ఓపెన‌ర్ల వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో ష‌కీల్, రిజ్వాన్ తో కలిసి జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నం చేశాడు. వీరిద్ద‌రూ మిడిల్ ఓవ‌ర్ల‌లో మరీ నెమ్మ‌దిగా ఆడి కాసేపు విసుగు తెప్పించారు. ఆ తర్వాత గేర్ మార్చిన ష‌కీల్.. బ్యాట్ ఝ‌ళిపించాడు. అలా వీరిద్ద‌రూ మూడో వికెట్ కి 104 ప‌రుగులు జోడించారు. ఈ ద‌శ‌లో స్కోరు వేగాన్ని పెంచే క్ర‌మంలో రిజ్వాన్ భారీ షాట్ కు ప్ర‌య‌త్నించ‌గా హ‌ర్షిత్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అయితే మ‌రుస‌టి ఓవ‌ర్లోనే అక్ష‌ర్ ప‌టేల్ అత‌డిని బౌల్డ్ చేసి ఇంటిముఖం ప‌ట్టించాడు. 

ప‌ట్టు బిగించిన భార‌త్.. ఒక ద‌శ‌లో 151-2తో ప‌టిష్టంగా క‌నిపించిన పాక్.. భార‌త్ బౌల‌ర్లు రాణించడంతో చివ‌రి ఎనిమిది వికెట్ల‌ను కేవ‌లం 90 ప‌రుగుల‌కే కోల్పోయింది. ముందుగా 63 బంతుల్లో ఫిఫ్టీ చేసిన ష‌కీల్.. భారీ షాట్ ఆడ‌గా.. మిస్ జ‌డ్జ్ మెంట్ తో కుల్దీప్ క్యాచ్ మిస్ చేశాడు. అయితే త‌ర్వాతి ఓవ‌ర్లోనే హార్దిక్ పాండ్యా అత‌డిని పెవిలియ‌న్ కు పంపాడు. అలాగే ఈ ఫార్మాట్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఆ త‌ర్వాత మిగ‌తా బ్యాట‌ర్ల‌ను బౌల‌ర్లు చ‌క‌చ‌కా పెవిలియ‌న్ కు పంపారు. అయితే ఒక ఎండ్ లో స్థిరంగా నిల‌బ‌డిన ఖుష్ దిల్ షా (38) జ‌ట్టు స్కోరును 240 ప‌రుగుల మైలురాయిని దాటించాడు. ఇక నసీమ్ షా క్యాచ్ ను ప‌ట్టిన కోహ్లీ.. వ‌న్డేల్లో అత్య‌ధిక క్యాచులు ప‌ట్టిన భార‌త ఫీల్డ‌ర్ గా రికార్డుల‌కెక్కాడు. మిగ‌తా బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్, అక్ష‌ర్, జ‌డేజాల‌కు తలో వికెట్ ద‌క్కింది. 

Read Also: Kohli Records: ఈ రికార్డులపై కోహ్లీ గురి.. నేడు పాక్ తో భారత్ పోరు.. ఊరిస్తున్న 2 రికార్డులు