India vs Pakistan Champions Trophy 2025 News: దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతుంది. ఆదివారం దుబాయ్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో అందరి దృష్టి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉంది. అతను రెండు రికార్డులపై కన్నేయడంతో ఈ మ్యాచ్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు కెరీర్లో 13, 985 పరుగులు చేసిన కోహ్లీ.. మరో 15 పరుగులు చేస్తే, అత్యంత వేగంగా 14వేల వన్డే పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డులకెక్కుతాడు. 14వేల క్లబ్బులో ఇప్పటవరకు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ క్లబ్బును నెలకొల్పగా, శ్రీలంక లెజెండరీ క్రికెటర్ కుమార సంగక్కర ఉన్నాడు. పాక్ తో మ్యాచ్ లో మరో 15 పరుగులు జోడిస్తే కోహ్లీ కూడా ఈ క్లబ్బులో స్థానం సంపాదిస్తాడు. సచిన్ టెండూల్కర్ తన 350 ఇన్నింగ్స్ లో ఈ మైలురాయిన చేరుకోగా.. 378వ ఇన్నింగ్స్ లో సంగక్కర ఈ మార్కును చేరుకున్నాడు. అయితే చాలా భారీ తేడాతో ఈ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టే అవకాశముంది.
70+ ఇన్నింగ్స్ ల తేడా..ఇప్పటివరకు కెరీర్లో 298 వన్డేలు ఆడిన కోహ్లీ.. 286 ఇన్నింగ్స్ లో 13, 985 పరుగులు చేశాడు. 57.78 సగటుతో 50 సెంచరీలు , 73 అర్థ సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్ లో మరో 15 పరుగులు సాధిస్తే 70+ ఇన్నింగ్స్ ల తేడాతో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే మరో భారత రికార్డుపై కోహ్లీ కన్నేశాడు. ఇండియా తరపున అత్యధిక క్యాచ్ లు పట్టిన క్రికెటర్ గా నిలవడానికి మరొక్క క్యాచ్ పడితే చాలు. ఇప్పటివరకు 298 వన్డేల్లో 156 క్యాచ్ లు పట్టిన కోహ్లీ.. మహ్మద్ అజారుద్దీన్ పేరిట ఉన్న అత్యధిక క్యాచులు పట్టిన భారత ఫీల్డర్ రికార్డును సమం చేశాడు. మరో క్యాచ్ పడితే ఈ రికార్డు కోహ్లీ సొంతం అవుతుంది.
పాక్ లో అది కొరవడింది..ప్రస్తుత పాక్ జట్టు పరిస్థితిని చూసి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ అసంతప్తి వ్యక్తం చేశాడు. తన కెరీర్ లో ఇలాంటి బలహీన పాక్ జట్టును చూడలేదని విమర్శించాడు. కొన్నేళ్లలో ఇలాంటి పాక్ జట్టును తాను చూడలేదని, గతంలో వారితో ఆడే సమయంలో.. ఆ జట్టులో స్టార్ ఆటగాళ్లు, అద్భుతమైన బౌలింగ్, ఐకమత్యం కనిపించేవని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం జట్టులో ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించే వాళ్లున్నా.. ఐకమత్యం మాత్రం కొరవడిందని పేర్కొన్నాడు. తమదైన రోజున వారు మ్యాచ్‌లను గెలిపించగలరు.. కానీ, అలాంటి ఆటగాళ్లు ఏడు లేదా ఎనిమిది మంది ఉంటేనే ఛాంపియన్‌షిప్‌ను గెలవగలమని పేర్కొన్నాడు. అలాంటిదేమీ ఈ జట్టులో కనిపించడంలేదని, 2017లో ఫకర్ జమాన్ పెద్ద ఇన్నింగ్సులు ఆడటంతోనే నిస్సందేహంగా పాక్ గెలిచిందని పేర్కొన్నాడు.
భారత జట్టు ప్లేయింగ్ లెవన్ (అంచనా):
రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, అక్షర్, హార్దిక్, జడేజా, షమీ, హర్షిత్, వరుణ్.
Read Also: India vs Pakistan: టీమిండియా ప్లేయింగ్ లెవన్ ఇదే..! ఒక మార్పు తప్పదా? ఆ ప్లేయర్ పై వేటుకు ఛాన్స్