G Harris Hattrick Update: గ్రేస్ హారీస్ (4-15) హ్యాట్రిక్ తో సత్తా చాటడంతో డబ్ల్యూపీఎల్ లో యూపీ వారియర్జ్ బోణీ కొట్టింది. శనివారం బెంగళూరులో జరిగిన లీగ్ మ్యాచ్ లో 33 పరుగులతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. వెస్టీండీస్ ప్లేయర్ చినెల్ హెన్రీ విధ్వంసక అర్థ సెంచరీ (23 బంతుల్లో 62, 2 ఫోర్లు, 8 సిక్సర్లు) తో చెలరేగి డబ్ల్యూపీఎల్ లో జాయింట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేసింది. బౌలర్లలో జొనాసెన్ కు నాలుగు వికెట్లు దక్కాయి. ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. వన్ డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (35 బంతుల్లో 56, 8 ఫోర్లు, 1 సిక్సర్) ఫిఫ్టీతో సత్తా చాటింది. గ్రేస్ తోపాటు క్రాంతి గౌడ్ నాలుగు వికెట్లతో రాణించింది. ఈ విజయంతో రెండు పాయింట్లు సాధించి టోర్నీలో యూపీ ఖాతా తెరిచింది. ఆదివారం టోర్నీకి సెలవు. సోమవారం.. ఆర్సీబీ తో యూపీ తలపడుతుంది.
విఫలమైన బ్యాటర్లు..
ఛేజింగ్ లో డిల్లీ ఘోరంగా విఫలమైంది. ఆరంభంలోనే ఓపెనర్లు షెఫాలీ వర్మ (24), కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (4) వికెట్లను కోల్పోయిన ఢిల్లీ.. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఓ ఎండ్ లో జెమీమా నిలిచినా, తనకు సహకరించేవారు కరువయ్యారు. కాసేపు యూపీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న జెమీమా.. 30 బంతుల్లో ఫిఫ్టీ చేసి, స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ఔటయ్యింది. చివర్లో నికీ ప్రసాద్ (18) పోరాడినా టార్గెట్ పెద్దదిగా ఉండటంతో లాభం లేకుండా పోయింది. ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్ ను బౌలింగ్ చేసిన హారీస్ వరుస బంతుల్లో నికీ ప్రసాద్, అరుంధతి రెడ్డి, మిన్ను మణిలను ఔట్ చేసింది. దీంతో టోర్నీలో ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ గా రికార్డులకెక్కింది. హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
హెన్రీ రికార్డు ఫిఫ్టీ..
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన యూపీకి శుభారంభాన్ని అందించడంలో యూపీ బ్యాటర్లు విఫలమయ్యారు. కిరణ్ నవగిరే (17), దినేశ్ వృందా (4), కెప్టెన్ దీప్తి శర్మ (13), శ్వేతా షెరవాత్ (11), గ్రేస్ హరీస్ (2) మూకుమ్మడిగా విఫలమయ్యారు. తాహ్లియా మెక్ గ్రాత్ (24) మంచి స్టార్ట్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ దశలో
బ్యాటింగ్ కు వచ్చిన హెన్రీ తన తడాఖా చూపించింది. మైదానం నలువైపులా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించింది. దీంతో 18 బంతుల్లోనే ఫిఫ్టీ నమోదు చేసింది. మిగతా బౌలర్లలో అరుంధతి రెడ్డి, మరిజానే కాప్ లకు రెండు, శిఖా పాండేకు ఒక వికెట్ దక్కింది.