ICC Champions Trophy 2025 Live Updates: జోష్ ఇంగ్లీష్ ( 86 బంతుల్లో 120 నాటౌట్, 8 ఫోర్లు, 6 సిక్సర్లు), అలెక్స్ కేరీ (63 బంతుల్లో 69, 6 ఫోర్లు) అద్భుతంగా పోరాడ‌టంతో ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా రికార్డు చేజింగ్ సాధించింది. శ‌నివారం లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో 5 వికెట్ల‌తో ఆసీస్ గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 351 ప‌రుగులు చేసింది. టోర్నీ చ‌రిత్ర‌లో ఇదే తొలి ఇన్నింగ్స్ అత్య‌ధిక స్కోరు కావ‌డం విశేషం. ఓపెన‌ర్ బెన్ డ‌కెట్ భారీ సెంచ‌రీ (143 బంతుల్లో 165, 17 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)తో సత్తా చాటాడు. బౌల‌ర్ల‌లో కొత్త బౌల‌ర్ బెన్ డ్వార్షియ‌స్ కు మూడు వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేజింగ్ ను 47.3 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 356 ప‌రుగులు చేసి పూర్తి చేసింది. గ‌త‌వారం శ్రీ‌లంక చేతిలో 2-0తో క్లీన్ స్వీప్ కు గురైన ఆసీస్ .. ఐసీసీ టోర్నీలో త‌న పాత విశ్వ‌రూపాన్ని చూపించింది. చాలామంది కీల‌క‌మైన ఆట‌గాళ్లు దూర‌మైన‌ప్ప‌టికీ టోర్నీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ఛేద‌న‌ను పూర్తి చేసి రికార్డుల‌కెక్కింది. ఈ టోర్నీ చ‌రిత్ర‌లో 300+ ఛేద‌న‌ను చేసిన ఏకైక జ‌ట్టు ఆసీస్ మాత్ర‌మే కాగా, తాజాగా మ‌రోసారి కంగారూలే ఈ ఘ‌న‌త‌ను సాధించారు. ఇంగ్లీస్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 

డకెట్ జోరు..అంత‌కుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కు బెన్ డ‌కెట్ ఒంటిచేత్తో భారీ స్కోరు అందించాడు. దాదాపు 48 ఓవ‌ర్ల‌పాటు బ్యాటింగ్ చేసి, ప్ర‌త్య‌ర్తి బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసి బౌండ‌రీలు సాధించాడు. అంత‌కుముందు ఆరంభంలోనే ఫిల్ సాల్ట్ (10), జేమీ స్మిత్ (15) త్వ‌ర‌గా ఔట‌వ‌డంతో ఇంగ్లాండ్ క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో జో రూట్ (68) తో క‌లిసి జ‌ట్టును డ‌కెట్ న‌డిపించాడు. వీరిద్ద‌రూ ఇన్నింగ్స్ ను మంచిగా నిర్మించుకుంటూ ముందుకు న‌డిపించారు. ఈ క్ర‌మంలో మూడో వికెట్ కు 158 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని సాధించారు. ఈ క్ర‌మంలో 49 బంతుల్లో డకెట్ ఫిఫ్టీ పూర్తి చేయ‌గా, రూట్ 56 బంతుల్లో అర్థ సెంచ‌రీ సాధించాడు. ఆ త‌ర్వాత రూట్ వెనుదిరిగినా, డ‌కెట్ సాధికారికంగా బ్యాటింగ్ చేస్తూ, 95 బంతుల్లో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. చివ‌ర్లో ఆర్చ‌ర్ (21 నాటౌట్) బ్యాట్ ఝుళిపించ‌డంతో జ‌ట్టు స్కోరు 350+ ప‌రుగుల‌ను దాటింది. బౌల‌ర్ల‌లో ఆడం జంపా, మార్న‌స్ ల‌బుషేన్ కు రెండు, గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒక వికెట్ ద‌క్కింది. 

ఇంగ్లీస్ దెబ్బ..ఛేద‌న‌లో ఇంగ్లాడ్ కు జోష్ ఇంగ్లీస్ చుక్క‌లు చూపించాడు. ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ (6), కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (5) వికెట్లు తీసిన ఆనందాన్ని ఇంగ్లాండ్ కు ఎక్కువ సేపు మిగిలించ‌లేదు. క్యారీతో క‌లిసి అద్భుత‌మైన భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత అజేయంగా నిలిచి, జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఇంగ్లీస్-కేరీ జంట‌.. మ‌ధ్య‌లో మంచు కుర‌వ‌డంతో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారిపోవడాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది. వీరిద్ద‌రూ ఏమాత్రం ఒత్తిడి లేకుండా మైదానం నలువైపులా బౌండ‌రీలు బాదుతూ స్కోరు బోర్దును ప‌రుగులెత్తించారు. ఈ క్ర‌మంలో ఐదో వికెట్ కు ఏకంగా 146 ప‌రుగుల భాగ‌స్వ‌ామ్యాన్ని న‌మోదు చేశారు. ఫిప్టీ చేసిన త‌ర్వాత కేరీ వెనుదిరగ‌గా, చివ‌ర్లో మ్యాక్స్ వెల్  (32 నాటౌట్) సాయంతో జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. మ్యాక్స్ వెల్ తో కలిసి అత్యంత వేగంగా 74 పరుగల పార్ట్నర్ షిప్ ను నమోదు చేశాడు.  77 బంతుల్లోనే సెంచ‌రీ చేసి వ‌న్డేల్లో తొలి సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. అంత‌కుముందు ఓపెన‌ర్ మ‌థ్యూ షార్ట్ (63) ఫిఫ్టీతో రాణించాడు. బౌల‌ర్ల‌లో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చ‌ర్, బ్రైడెన్ కార్స్, ఆదిల్ ర‌షీద్, లియామ్ లివింగ్ స్ట‌న్ కు త‌లో వికెట్ ద‌క్కింది. 

Read Also: ENG vs AUS: ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఉతికారేసిన బెన్ డకెట్ -21 ఏళ్ల రికార్డు బ్రేక్