Adelaide Weather Forecast, IND vs ENG T20 WC 2022 Semis: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022లో రెండో సెమీస్‌కు టైమైంది! అడిలైడ్‌ వేదికగా టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ తలపడుతున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్‌ ఆరంభం అవుతోంది. అయితే ఈ పోరుకు వర్షం గండం పొంచివుంది!






అడిలైడ్‌లో రాత్రంతా వర్షం కురిసింది. మైదానం చిత్తడిగా మారింది. అయితే గురువారం ఉదయానికే వరుణుడు శాంతించిడం గమనార్హం. ఇప్పటికైతే ఆకాశంలో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణంలోనైనా వాన పడొచ్చు. లేదా చిరు జల్లులు కురవొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే వర్షం పడటంతో రెండు జట్లు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి ఓవర్‌ క్యాస్టింగ్‌ పరిస్థితులు బౌలింగ్‌ జట్లకు అనుకూలంగా ఉంటాయి. బంతి రెండు వైపులా స్వింగ్‌ అవుతుంది. బ్యాటర్లు ఆడేందుకు ఇబ్బంది పడతారు. ఏదేమైనా మ్యాచ్‌ సాంతం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చల్లని గాలులు బలంగా వీస్తాయి.


బ్యాటింగ్ లో ఆ ఒక్కరు తప్ప


భారత బ్యాటింగ్ ను ప్రస్తుతం కలవరపెడుతున్న అంశం కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్. సూపర్- 12 లో జరిగిన 5 మ్యాచుల్లో 4 సార్లు రోహిత్ విఫలమయ్యాడు. పసికూన నెదర్లాండ్స్ పై మాత్రమే అర్థశతకం సాధించాడు. ఈ విషయం ఇప్పుడు జట్టుతో పాటు అభిమానులను కలవరపెడుతోంది. కీలకమైన నాకౌట్ మ్యాచులో భారత కెప్టెన్ కచ్చితంగా రాణించాల్సిందే. అయితే రాహుల్ ఫాం అందుకోవడం.. కోహ్లీ, సూర్య సూపర్ టచ్ లో ఉండడం భారత్ కు సానుకూలాంశం. హార్దిక్ పాండ్య ఆల్ రౌండ్ మెరుపులు ఇప్పటివరకు కనిపించలేదు. బౌలింగ్ లో కీలక సమయంలో వికెట్లు తీస్తున్నప్పటికీ బ్యాటింగ్ లో రాణించాల్సి ఉంది.


ఆ ఇద్దరిలో ఎవరు?


దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్.. భారత జట్టు యాజమాన్యం ఇప్పుడు వీరిద్దరి విషయంలో డైలమాలో ఉంది. ఫినిషర్ గా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్.. ఇప్పటివరకు ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు. జింబాబ్వేతో జరిగిన చివరి లీగ్ మ్యాచులో చోటు దక్కించుకున్న పంత్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు కీలకమైన సెమీస్ లో వీరిద్దరిలో ఎవరిని ఆడించాలనే దానిపై యాజమాన్యం తర్జనభర్జనలు పడుతోంది.  ఒత్తిడి ఎక్కువగా ఉండే మ్యాచులో సీనియర్ అయిన దినేశ్ కార్తీక్ వైపు చూసే అవకాశాలు అధికం. అయితే కుడి, ఎడమ కాంబినేషన్ కావాలనుకుంటే మాత్రం పంత్ ను తీసుకునే అవకాశం ఉంది.