IND vs ENG 3rd Test Team India Captain Rohit Sharma Century:  రాజకోట్ వేదికగా ఇంగ్లాండ్ తో  జరుగుతున్న మూడో టెస్ట్ లో హిట్ మాన్ సత్తా చాటాడు. తన సహజ శైలికి విరుద్ధంగా ఓపికగా బాటింగ్ చేసిన రోహిత్(Rohit Sharma) అద్భుత శతకంతో టీమిండియాను పోటీలోకి తెచ్చాడు.. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ను రోహిత్..జడేజా ఆదుకున్నారు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో రోహిత్ శతకంతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు 11 ఫోర్లు, 2 సిక్సలతో సెంచరీ చేసి భారత్ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. రవీంద్ర జడేజా కూడా అర్ధ శతకంతో రాణించాడు.  మ్యాచ్ ప్రారంభ‌మైన  అర‌గంట‌లోనే 10 ఓవ‌ర్లు కూడా కాక‌ముందే భార‌త్ మూడు వికెట్లు కోల్పోయింది. యంగ్ ప్లేయ‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్, ర‌జ‌త్ ప‌టిదార్, శుభ్ మ‌న్ గిల్ త్వ‌ర‌గానే ఔట్ అయ్యారు. వ‌రుస వికెట్లు ప‌డుతున్న క్ర‌మంలో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ మ‌రోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. 


గతంలో ఇంగ్లాండ్ పై డ‌బుల్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన య‌శ‌స్వి జైస్వాల్ ఈసారి 10 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన శుభ్ మ‌న్ గిల్ డ‌కౌట్ గా పెవిలియ‌న్ కు చేరాడు. ర‌జ‌త్ ప‌టిదార్ కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండ‌లేక‌పోయాడు. 5 ప‌రుగులు చేసి టామ్ హార్ట్లీ బౌలింగ్ లో బెన్ డ‌కెట్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 


పట్టుదలగా ఇంగ్లాండ్‌

రెండో టెస్ట్‌ తర్వాత అబుదాబి వెళ్లి విశ్రాంతి తీసుకున్న ఇంగ్లాండ్‌ ఆటగాళ్ళు... మళ్లీ భారత్‌లో అడుగుపెట్టి ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమించారు. హార్ట్‌ లీ భీకర ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు సానుకూలంగా మారింది. జో రూట్‌ బ్యాట్‌తో పాటు బౌలర్‌ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. 100వ టెస్టులో బెన్ స్టోక్స్(Ben Stokes) రాణించాలని పట్టుదలగా ఉన్నాడు. దశాబ్దకాలంగా ఇంగ్లండ్‌కు ఆడుతున్న స్టోక్స్‌ రాజ్‌కోట్‌ టెస్టును మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పటివరకూ 99 టెస్టులు ఆడిన స్టోక్స్‌.. 6,251 పరుగులు చేశాడు. 36.34 సగటుతో 13 సెంచరీలు, 31 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. బౌలింగ్‌లో 197 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఆరు వేల పరుగులు, 150కి పైగా వికెట్లు తీసిన ఆల్‌రౌండర్లలో జాక్వస్‌ కలిస్‌ (13,289 పరుగులు, 292 వికెట్లు), గ్యారీ సోబర్స్‌ (8,032 పరుగులు, 235 వికెట్లు) తర్వాత స్థానంలో స్టోక్స్‌ ఉన్నాడు. అలాగే  ఇంగ్లండ్‌ దిగ్గజం జేమ్స్‌ అండర్సన్‌(James anderson ) మరో ఐదు వికెట్లు తీయగలిగితే టెస్టులలో 700 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. అండర్సన్‌కు ఇది 185వ టెస్టు కానుంది. అండర్సన్‌.. ఇప్పటివరకు 184 టెస్టులలో 695 వికెట్లు తీశాడు. 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.


ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.