India vs England Live Score, 2nd Test Day 3: విమర్శలను  తిప్పికొడుతూ.. అనుమానాలను పటాపంచలు చేస్తూ టీమిండియా స్టార్‌ శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill) శతక నినాదం చేశాడు. రెండో టెస్ట్‌లో కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో గిల్‌ 132 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సులతో 100 పరుగులు చేసి సత్తా చాటాడు. వన్‌ డౌన్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పెద్దగా రాణించని గిల్‌... రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ త్వరగానే అవుటై నిరాశను మిగిల్చాడు. గత ఐదు టెస్టుల్లో గిల్‌ అత్యధిక స్కోరు 36 పరుగులే. వైజాగ్‌ టెస్టులో 34 పరుగులు చేసి జోరు మీద కనిపించి హాఫ్‌ సెంచరీ అయినా చేస్తాడన్న అభిమానుల ఆశ నెరవేరలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో మ్యాచ్‌ను పూర్తిగా భారత్‌ చేతుల్లోకి తెచ్చేశాడు గిల్‌. గిల్‌-అక్షర్‌ పటేల్‌(Axar Patel) పోరాటంతో టీమిండియా ఇప్పటికే 350 పరుగుల ఆధిక్యంలో ఉంది. గిల్‌ 101, అక్షర్‌ పటేల్‌ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరి కాసేపు ఆడితే ఇంగ్లాండ్‌ ముందు భారీ లక్ష్యం నిలవనుంది.
 

తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం

తొలి ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్‌ డబుల్‌ సెంచరీతో 396 పరుగులు చేసిన రోహిత్ సేన... అనంతరం ఇంగ్లాండ్‌ జట్టును 253 పరుగులకే కుప్పకూల్చింది. బుమ్రా పదునైన బంతులతో బ్రిటీష్‌ జట్టు పతనాన్ని శాసించాడు. ఆరు వికెట్లు నేలకూల్చి టీమిండియా విజయావకాశాలను మెరుగుపర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్రిటీష్‌ జట్టుకు.. ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించి టీమిండియాలో ఆందోళన పెంచారు. కుల్‌దీప్‌ యాదవ్‌.. డకెట్‌ను అవుట్‌ చేసి భారత్‌కు తొలి వికెట్‌ అందించాడు. డకెట్‌ అవుటైనా క్రాలే సాధికారికంగా ఆడాడు. శతకం దిశగా సాగుతున్న క్రాలేను అక్షర్‌ పటేల్‌ అవుట్‌ చేశాడు. 76 పరుగులు చేసి క్రాలే అవుట్‌ అవ్వగా... 118 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. తర్వాత బూమ్‌ బూమ్‌ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో బ్రిటీష్‌ జట్టును ముప్పుతిప్పలు పెట్టాడు. తొలుత బెయిర్‌ స్టోను అవుట్‌ చేసిన బుమ్రా... ఆ తర్వాత తొలి మ్యాచ్‌ హీరో ఓలి పోప్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసి ఇంగ్లాండ్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు. 25 పరుగులు చేసిన బెయిర్‌ స్టోను కూడా బుమ్రా అవుట్‌ చేశాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ స్వల్పవ్యవధిలో బెన్‌ ఫోక్స్‌ (6), రెహాన్ అహ్మద్‌ (6)లను వెనక్కి పంపాడు. అర్ధ శతకం దిశగా సాగుతున్న స్టోక్స్‌ని బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేసి టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అదుకున్నాడు. చివరి రెండు వికెట్లు హార్ట్‌లీ (21), జేమ్స్‌ అండర్సన్‌ (6) కూడా బుమ్రాకే దక్కాయి.  బెన్‌ స్టోక్స్‌ 47 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ను కాపాడేందుకు ప్రయత్నించినా... బుమ్రా ఓ అద్భుత బంతితో స్టోక్స్‌ను బౌల్డ్‌ చేశాడు. అనంతరం 253 పరుగులకు ఇంగ్లాండ్‌ ఆలౌట్‌ అయింది. క్రాలే 76, స్టోక్స్‌ 47 పరుగులతో రాణించగా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా ఆరు, కుల్‌దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు తీశారు. 

 

యశస్వీ ద్వి శతక మోత

 రెండో టెస్ట్‌లో యశస్వి డబుల్‌ సెంచరీతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన యశస్వి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్‌, బుమ్రా, ముఖేష్‌ కుమార్‌ తక్కువ పరుగులకే అవుట్‌ కావడంతో భారత జట్టు 400 పరుగులకు నాలుగు పరుగుల దూరంలోనే అగిపోయింది. నిన్నటి ఫామ్‌ను కొనసాగించిన యశస్వి ద్వి శతకాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించాడు. సిక్సర్‌తో సెంచరీని అందుకున్న ।యశస్వి  జైస్వాల్‌... ఫోర్‌తో డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.