వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో అరుదైన దృశ్యం కనిపించింది. హార్థిక పాండ్యాకు గాయమైనందుకు అతని ప్లేస్‌లో కోహ్లీ బౌలింగ్ చేశాడు. మ్యాచ్‌లో తొమ్మిదో ఓవర్ వేస్తున్న టైంలో ఈ సన్నివేశం జరిగింది. పాండ్యా వేసిన మొదటి రెండు బంతులను బంగ్లా బ్యాటర్ ఫోర్లుగా మలిచారు. అందులో రెండో పోర్ ఆపే క్రమంలో పాండ్యా గాయపడ్డారు. వైద్యులు వచ్చి చికిత్స చేసినా నయం కాలేదు. బౌలింగ్ వేసే పరిస్థితి లేకపోవడంతో అతను డగౌట్‌కు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆయన వేయగా మిగిలిన బంతులను కోహ్లీ పూర్తి చేశాడు. 

 

టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందన్న వార్తల నేపథ్యంలో టాస్‌ గెలిచిన బంగ్లా ఆచితూచి ఆడుతోంది. మొదటి ఐదు ఓవర్లు స్లోగా ఆడిన బంగ్లాదేశ్‌ తర్వాత స్పీడ్ పెంచింది పిచ్‌పై బౌన్స్‌ లభిస్తుండడంతో బౌలర్లు కూడా రాణించే అవకాశం ఉంది. అనుకున్నట్లుగానే జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగింది. ప్రపంచకప్‌ మహా సంగ్రామంలో బంగ్లాదేశ్‌ను చిత్తు చేయాలని పట్టుదలగా ఉంది.

 

మహా సంగ్రామంలో బంగ్లాదేశ్‌ను చిత్తు చేయాలని పట్టుదలగా ఉంది. సెమీస్‌కు మార్గం సుగుమం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌ కీలకం కావడంతో రోహిత్‌ సేన అలసత్యానికి చోటివ్వకుండా గెలవాలని రోహిత్‌ సేన చూస్తోంది. గత నాలుగు వన్డేల్లో మూడుసార్లు టీమిండియాను బంగ్లాదేశ్‌ ఓడించింది. 2022డిసెంబర్‌లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో రెండుసార్లు ఇటీవల జరిగిన ఆసియాకప్‌ సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌లో ఒకసారి టీమిండియాను బంగ్లా ఓడించింది. ఈ గణాంకాలే ఇప్పుడు రోహిత్‌ సేనను ఆందోళన పరుస్తున్నాయి. కానీ ఇరు జట్ల ప్రస్తుత ఫామ్‌ను చూస్తే భారత జట్టు పెద్ద కష్టం కాకపోవచ్చని మాజీలు అంచనా వేస్తున్నారు. కానీ ఈ మ్యాచ్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగే బంగ్లాను తక్కువ అంచనా వేస్తే టీమిండియా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పుదు. అఫ్గానిస్తాన్ చేతిలో ఇంగ్లాండ్ నెదర్లాండ్స్‌ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో ఇప్పుడు భారత్‌ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని క్రికెట్‌ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

 

బ్యాటింగ్‌లో తిరుగులేదు...

ఎలాంటి అలసత్వానికి చోటివ్వకుండా భారత్‌.. బంగ్లాదేశ్‌పై బరిలోకి దిగనుంది. ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాల పరంపర కొనసాగించాలని చూస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని చూస్తుండగా... శుభ్‌మన్ గిల్, విరాట్‌ కోహ్లీ భారీ స్కోర్లపై కన్నేశారు. రోహిత్ గత రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌పై 86, అఫ్ఘానిస్తాన్‌పై 131 పరుగులతో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అదే ఫామ్‌ కొనసాగి రోహిత్‌ భారీ ఇన్నింగ్స్ ఆడితే బంగ్లాపై గెలుపు ఏకపక్షంగా మారవచ్చు. డెంగ్యూ నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్ పెద్ద స్కోర్‌ను చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ ఏడాది గిల్‌ వన్డేల్లో అద్భుతంగా రాణించాడు. కోహ్లీ ఆస్ట్రేలియాపై 85 పరుగులతో మ్యాచ్‌ విన్నింగ్‌ నాక్‌ ఆడాడు. అఫ్ఘానిస్థాన్‌పైనా అజేయంగా 55 పరుగులు చేశాడు.

 

పాకిస్థాన్‌పై శ్రేయాస్ అయ్యర్ అజేయ అర్ధ శతకంతో సహా కె.ఎల్‌. రాహుల్‌ మంచి ఫామ్‌లో ఉండడంతో టీమిండియాకు బ్యాటింగ్‌లో తిరుగులేని విధంగా ఉంది. వన్డేల్లో ఈ వేదికపై ఏడు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా నాలుగు మ్యాచుల్లో గెలిచి.. మూడింట్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియాను కేవలం 199 పరుగులకే, పాకిస్థాన్‌ను 191 పరుగులకే పరిమితం చేసి భారత బౌలర్లు టాప్‌ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లోనూ టీమిండియా అద్భుతాలు చేస్తోంది.

 

బంగ్లా కూడా బలంగానే

ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఆఫ్ఘానిస్తాన్... దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్‌ ఓడించడంతో తాము సత్తా చాటాలని బంగ్లాదేశ్‌ భావిస్తోంది. ఈ ప్రపంచ కప్‌లో మరొక విజయాన్ని నమోదు చేయాలని బంగ్లా పట్టుదలగా ఉంది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయం నుంచి కోలుకుని ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాలని జట్టు కోరుకుంటోంది. ప్రాక్టీస్‌ సెషన్‌లో షకీబ్ బౌలింగ్ చేయకపోవడం బరిలోకి దిగడంపై అనుమానాలను పెంచుతోంది. ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్‌లో గెలచిన బంగ్లా... తర్వాత రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ కూడా ఓడితే బంగ్లా సెమీస్‌ ఆశలు సంక్లిష్టంగా మారుతాయి. నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్‌ల రాణిస్తారని బంగ్లా జట్టు ఆశలు పెట్టుకుంది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ , టస్కిన్ అహ్మద్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును ఆందోళన పరుస్తోంది.

 

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా , శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ , రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, 

బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, మహిదీ హసన్, తస్కిన్ అహ్మద్ ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్.