Rohit Sharma Innings: పోరాడి ఓడిపోయింది. ఏదైనా జట్టు గెలుపు అంచుల వరకు వచ్చి ఓడిపోతే అలాంటి పదాలు ఉపయోగిస్తాం. ఈరోజు బంగ్లాతో మ్యాచులోనూ టీమిండియా విజయానికి ఒక మెట్టు దూరంలో ఆగిపోయింది. అంటే పోరాడి ఓడిపోయింది. అయితే ఆ పోరాటం చేసింది రోహిత్ శర్మ. అదికూడా మాములుగా కాదు. విరిగిన చేతి వేలు నొప్పి పుడుతున్నా... ప్రత్యర్థి బౌలర్లు పరీక్షిస్తున్నా... ఓటమి భయం కళ్లముందు కదులుతున్నా... సిరీస్ ఆశలు చేజారిపోతున్న సమయంలో భారత కెప్టెన్ చేసిన పోరాటం అద్వితీయం. అభినందనీయం. అనుసరణీయం.
బంగ్లాతో మ్యాచులో టీమిండియా ఓడిపోయింది. దాంతో పాటు సిరీసూ పోయింది. అయితేనేం మన కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన ఇన్నింగ్స్ తో భారత అభిమానులతో పాటు ప్రత్యర్థి ఫ్యాన్స్ ల మనసులనూ గెలిచాడు. గాయపడ్డ చేతితో రోహిత్ కొట్టిన ఒక్కో షాట్ కి అభిమానులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఓవైపు భరించలేని నొప్పి బాధపెడుతున్నా.. జట్టును గెలిపించాలనే పట్టుదలతో అతను ఆడిన ఈ ఇన్నింగ్స్ ఏ సెంచరీకి తక్కువకాదు.
రోహిత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఎడమ చేతి బొటనవేలికి తీవ్ర గాయం అయింది. తర్వాత హిట్ మ్యాన్ మైదానంలోకి రాలేదు. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 10 మందితోనే ఆడేలా కనిపించింది. అయితే ఏడో వికెట్ పడ్డాక క్రీజులోకి వచ్చిన రోహిత్ టీమిండియాను లక్ష్య ఛేదన దిశగా తీసుకెళ్లాడు. అసలు తనకు గాయం అయ్యిందన్న విషయం ప్రేక్షకులు మర్చిపోయేట్లుగా హిట్ మ్యాన్ షాట్లు కొట్టాడు. తనకు స్ట్రైకింగ్ వచ్చినప్పుడల్లా బంతిని స్టాండ్స్ లోకి పంపాడు. చివరి 2 బంతుల్లో 12 పరుగులు అవసరమైమ దశలో ఒక సిక్స్ మాత్రమే కొట్టగలిగాడు. దీంతో టీమిండియా ఓడిపోయింది. అయితేనే ఒక యోధుడిలా మైదానం వీడుతున్న రోహిత్ ను ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు.
ఈ మ్యాచులో రోహిత్ శర్మ సాధించిన అర్ధశతకం ఏ సెంచరీకి తక్కువకాదు. ఏ రికార్డులకు సాటిరాదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రోహిత్ ఆడిన ఈ ఇన్నింగ్స్ యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఏ సందేహం లేదు.