IND vs AUS 1st test:  ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 223  పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 7 వికెట్ల నష్టానికి 321 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌ 400 పరుగులకు ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్ (174 బంతుల్లో 84), షమీ (47 బుంతుల్లో 37) అద్భుతంగా రాణించి భారత్‌కు మంచి స్కోరు అందించారు. అక్షర్ కు టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోరు.


ఆదిలోనే దెబ్బ


321 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట ఆరంభించిన భారత్‌ ను మర్ఫీ ఆదిలోనే దెబ్బతీశాడు. రెండో రోజు స్కోరుకు 4 పరుగులే జోడించిన జడేజాను 70 పరుగుల వద్ద మర్ఫీ బౌల్డ్ చేశాడు. అనంతరం అక్షర్ కు జతకలిసిన షమీ భారీ షాట్లు ఆడాడు. 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 47 బంతుల్లో 37 పరుగులు చేశాడు. మర్ఫీ వేసిన ఓ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న షమీని... తర్వాత వేసిన ఓవర్‌లో మర్ఫీ బోల్తా కొట్టించాడు. కీపర్ క్యాచ్ ద్వారా షమీని ఔట్ చేశాడు. మరోవైపు అక్షర్ నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డును నడిపించాడు. దీంతో భారత్ స్కోరు 400కు చేరుకుంది. ఆ వెంటనే అక్షర్ (84)ను కమిన్స్ బౌల్డ్ చేశాడు. 






రాణించిన బ్యాటర్లు


కెప్టెన్ రోహిత్ శర్మ (212 బంతుల్లో 120), ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ( 185 బంతుల్లో 70), అక్షర్ పటేల్    (174 బంతుల్లో 84) లు రాణించటంతో ఆస్ట్రేలియా పై పైచేయి సాధించింది. సెంచరీతో రోహిత్ శర్మ పలు రికార్డులను చేరుకున్నాడు. రెండేళ్ల తర్వాత శతకం బాదిన హిట్ మ్యాన్ కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా కెప్టెన్ గా టీ20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో శతకాలు చేసిన మొదటి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 


టాడ్ మర్ఫీ అదిరే అరంగేట్రం


ఆస్ట్రేలియా అరంగేట్ర ఆటగాడు టాడ్ మర్ఫీ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఈ ఆస్ట్రేలియా యువ ఆఫ్ స్పిన్నర్ 7 వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలోనే డీబట్ మ్యాచ్ లోనే 7 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ గా రికార్డుల్లో నిలిచాడు. 


జడేజా ఆల్ రౌండ్ షో


తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షో ప్రదర్శించాడు. బంతితో 5 వికెట్లు పడగొట్టిన జడ్డూ.. బ్యాట్ తోనూ 70 పరుగులు చేశాడు. అక్షర్ తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించిన జడేజా జట్టు భారీ స్కోరు సాధించడంలో సహాయపడ్డాడు.