Cricket News: ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ ముందు మరో సవాల్ నిలిచింది. శనివారం నుంచి బ్రిస్బేన్‌లో మూడో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ గెలవడం ఇరుజట్లకు తప్పనిసరి. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. అటు ఆసీస్ ఇప్పటికే ఒక మార్పు చేసింది. స్కాట్ బోలాండ్ స్థానంలో స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ తుది జట్టులో ఆడతాడని తెలిపింది. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టులో మార్పులు ఖాయమని తెలుస్తోంది. 


ఇద్దరు బౌలర్ల మార్పు..
ఈ మ్యాచ్‌లో కచ్చితంగా రెండు మార్పులు జరిగే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా భారీగా పరుగులిస్తూ, వికెట్లు తీయడంలో విఫలమైన హర్షిత్ రాణా ప్లేసులో ఆకాశ్ దీప్‌ను తుదిజట్టులో ఆడించే అవకాశముంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్, కివీస్ జట్లతో జరిగిన సిరీస్‌ల్లో ఆకాశ్ దీప్ సత్తా చాటాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే తను జట్టులోకి రావడం ఖాయం. మరోవైపు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ని ఆడించే అవకాశముంది. రెండో టెస్టులో సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన అశ్విన్ తేలిపోయాడు. అటు బ్యాటింగ్‌లో విఫలమైన అశ్విన్.. ఇటు బౌలింగ్‌లోనూ ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్మంట్ తనకే ఓటేసే అవకాశముంది. 


Also Read: Ind Vs Aus Test Series: బ్రిస్బేన్ టెస్టుకు ఆసీస్ జట్టులో మార్పులు- స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ


బ్యాటర్లు సిద్ధమవ్వాలి..
మరోవైపు భారత బ్యాటింగ్ లైనప్ కూడా విమర్శకులకు తమ బ్యాట్లతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విఫలమవుతుండటం జట్టులో ఆందోళన కలిగిస్తోంది. పెర్త్ టెస్టులో సెంచరీతో కోహ్లీ రాణించినా, అడిలైడ్‌లో మాత్రం తేలిపోయాడు. ఇక రోహిత్ నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. ఈ నేపథ్యంలో తను రెగ్యులర్‌గా ఆడే ఓపెనింగ్‌లోనే ఆడే అవకాశముంది. భారత మాజీలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఓపెనింగ్‌లోనే రోహిత్ బ్యాటింగ్ చేస్తే రాణించే అవకాశముందని పేర్కొంటున్నారు. గత ఏడాదిగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బోల్తా పడుతోంది. ఇప్పటివరకు ఆరు ఇన్నింగ్స్‌లలో జట్టు స్కోరు 150 కంటే తక్కువ నమోదు కావడం గమనార్హం. మేటి బ్యాటర్లతో నిండిన టీమిండియా ఇలా తేలిపోవడంపై అభిమానులు నిరాశ పడుతున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా భారత బ్యాటర్లు సత్తా చాటి, భారీ స్కోరు చేయాలని ఆశిస్తున్నారు. 


భారత్ తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.


Also Read: Syed Mushtaq Ali Trophy final: ముంబై X మధ్యప్రదేశ్- సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఫైనల్ ఖరారు.. బ్యాటింగ్ పవర్ తో సెమీస్ లో విజయం