BGT Series: టీమిండియాతో బ్రిస్బేన్ లో జరిగే మూడో టెస్టుకు ఆస్ట్రేలియా ఒక్క మార్పు చేసింది. తుది జట్టులో స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ తిరిగి చోటు దక్కించుకున్నాడు. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడి, అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టుకు దూరమైన హేజిల్ వుడ్... తాజాగా పూర్తిగా ఫిట్ గా మారాడని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. తొలి టెస్టు ముగిసిన తర్వాత నుంచి హేజిల్ వుడ్ ని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం తను పూర్తి ఫిట్ గా మారడంతో తుది జట్టులోకి ఎంపిక చేశామని పేర్కొన్నాడు. పెర్త్ టెస్టులో ఐదు వికెట్ల హాల్ తో హేజిల్ వుడ్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. 


పూర్ స్కాట్ బోలాండ్..
ఇక రెండోటెస్టులో హేజిల్ వుడ్ స్థానంలో జట్టులోకి వచ్చిన పేసర్ స్కాట్ బోలాండ్ అదరగొట్టాడు. ఆ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో సత్తాచాటిన బోలాండ్ రెండు వికెట్లు తీశాడు. అలాగే రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లతో సత్తాచాటాడు. ముఖ్యంగా శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ వంటి టాప్ ప్లేయర్లను తన స్వింగ్, పేస్ తో ఇబ్బంది పెట్టాడు. అయితే హేజిల్ వుడ్ రాకతో తను బెంచ్ కే పరిమితమయ్యాడు. బొలాండ్ విషయంలో చేసేదేమీ లేదని కమిన్స్ నిస్సాహయత వ్యక్తం చేశాడు. నిజానికి గత 18 నెలలుగా ఎక్కువ శాతం బోలాండ్ బెంచ్ కే పరిమితం అవుతున్నాడని, అయితే తనకు అవకాశం లభించనప్పుడు మాత్రం బంతితో చెలరేగిపోతున్నాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం హేజిల్ వుడ్ ఫిట్ గా మారడంతో తను బెంచ్ కే పరిమితమవ్వక తప్పదని సూచించాడు. మరోవైపు జట్టులో విబేధాలతోనే హేజిల్ వుడ్ ను రెండో టెస్టులో తప్పించారనే పుకార్లకు తాజా ప్రకటతో చెక్ పడింది. గాయం బారిన పడిన తనకు రెండో టెస్టులో విశ్రాంతి ఇచ్చారని తెలుస్తోంది. 


Also Read: Ind Vs Aus Test Series: 'గబ్బా'లో గెలిస్తే సిరీస్ సొంతమైనట్లే.. రోహిత్ ఆ స్థానంలో బ్యాటింగ్ కు దిగాలి... మాజీ కోచ్ సూచన


గబ్బాలో ఆసీస్ వెనుకడుగు..
మరోవైపు మూడో టెస్టు ఈనెల 14 నుంచి బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరుగుతుంది. అయితే ఈ వేదికపై ఆసీస్ కు ఉన్న అద్భుత రికార్డుకు భారత్ చెక్ పెట్టింది. 1988 నుంచి ఈ వేదికపై అజేయంగా నిలిచిన ఆసీస్ ను 2021లో భారత్ ఓడించింది. అలాగే సిరీస్ ను2-1తో సొంతం చేసుకుని, వరుసగా రెండోసారి ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ గెలుపొందిన రికార్డుల్లోకి ఎక్కింది. ఆ టెస్టు తర్వాత ఇంగ్లాండ్, సౌతాఫ్రికాలను ఇదే వేదికపై మట్టికరిపించిన ఆసీస్.. మళ్లీ వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆడటం భారత్ కు కాస్త సానుకూలాంశం. అయితే ఈ రికార్డులను తను పట్టించుకోనని కమిన్స్ అంటున్నాడు. జట్టు ఆటతీరుతోనే గెలుపోటములు నిర్దేశితమవుతాయిని ప్రకటించాడు.



అయితే లోలోపల మాత్రం ఈ వేదికలో భారత్ ను ఎదుర్కోవడం సవాలేనని కంగారూ జట్టు భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, ఐదు టెస్టుల బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్ లో తొలి టెస్టును భారత్ 295 పరుగులతో నెగ్గగా, రెండో టెస్టును కంగారూలు 10 వికెట్లతో కైవసం చేసుకున్నారు. దీంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది. 


ఆస్ట్రేలియా తుది జట్టు: నేథన్ మేక్ స్విన్నీ, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లుబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిషెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, మిషెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్, నేథన్ లయోన్.


Also Read: MS Dhoni: ధోనీతో వివాదంపై స్పందించిన ఎల్ఎస్జీ ఓనర్ గోయెంకా