Syed Mushtaq Ali Trophy final | దేశవాళీ ప్రతిష్టాత్మ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్ ఫైనల్ కు ముంబై, మధ్యప్రదేశ్ చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బరోడాను ఆరు వికెట్లతో ముంబై, ఢిల్లీని ఏడువికెట్లతో మధ్యప్రదేశ్ ఓడించాయి. ఇరుజట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.
రహానే వీరవిహారం..
ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న భారత క్రికెటర్ అజింక్య రహానే (56 బంతుల్లో 98, 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఫిఫ్టీతో ముంబైకి దాదాపుగా ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 46, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్సింగ్స్ తో చక్కని సహకారం అందించాడు. రెండోవికెట్ కు వీరిద్దరూ 88 పరుగులు జోడించడంతో సునాయాసంగా ముంబై ఈ మ్యాచ్ లో విజయం సాధించింది. పృథ్వీ షా (8), భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) విఫలమయ్యారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. శివాలిక్ శర్మ (36 నాటౌట్) టాప్ స్కోరర్. కెప్టెన్ క్రునాల్ పాండ్యా (30), అతిత్ సేథ్ (22) తమకు లభించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు.
ముంబై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో బరోడా భారీ స్కోరును సాధించ లేకపోయింది. గతవారం సిక్కింపై ప్రపంచ రికార్డు స్కోరు సాధించిన బరోడా.. ముంబైపై ఆ వాడిని చూపించలేకపోయింది. ఇక ముంబై బౌలర్లలో సుర్యాంశ్ షిగ్ద రెండు వికెట్లతో రాణించాడు. మోహిత్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, తనుష్ , అథర్వ అంకోలేకర్ లకు తలో వికెట్ దక్కింది. అనంతరం ఛేదనను ముంబై 17.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 164 పరుగులు చేసి అలవోకగా ఛేదించింది. రహానే సిక్సర్లతో విరుచుకు పడటంతో బరోడా బౌలర్లు తేలిపోయారు. బౌలర్లలో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, అతిత్, అభిమన్యు, శాశ్వత్ లకు తలో వికెట్ దక్కింది. రహానేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
రజత్ పాటిదార్ విధ్వంసం..
మరో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ (29 బంతుల్లో 66 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. దీంతో మధ్య ప్రదేశ్.. ఢిల్లీని సునాయాసంగా ఓడించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 146 పరుగుల సాధారణ స్కోరు చేసింది. జట్టులో అనూజ్ రావత్ (33 నాటౌట్) వేగంగా ఆడాడు. మయాంక్ రావత్ (24) ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ ఆయుష్ బదోని (19) విఫలమయ్యాడు. బౌలర్లలో ఐపీఎల్ స్టార్ వెంకటేశ్ అయ్యర్ కు రెండు వికెట్లు దక్కాయి. కుమార్ కార్తికేయ, త్రిపురేశ్, అవేశ్ ఖాన్ లకు తలో వికెట్ దక్కింది. అనంతరం ఛేదనను 15.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 152 పరుగులతో ఎంపీ పూర్తి చేసింది. హర్ప్రీత్ సింగ్ (46 నాటౌట్), హర్ష్ గావ్లి (30) రాణించారు. వెటరణ్ ఇషాంత్ శర్మకు రెండు వికెట్లు దక్కగా, హిమాంశు చౌహాన్ కు ఒక వికెట్ దక్కింది. తాజా విజయాలతో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఫైనల్ కు ముంబై, ఎంపీ చేరాయి. బెంగళూరు వేదికగా ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
Also Read: Ind Vs Aus Test Series: బ్రిస్బేన్ టెస్టుకు ఆసీస్ జట్టులో మార్పులు- స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ