U19 Asia Cup Final: టోర్నీలో లీగ్, నాకౌట్ దశలో అదరగొట్టిన టీమిండియా ఫైనల్ ఫోరులో మాత్రం చతికిలపడింది. అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ తుది మెట్టుపై భారత్ బోల్తా పడింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో 59 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. నిజానికి తొలుత భారత బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయగా.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఓవర్‌కు 4 పరుగుల రిక్వైర్డ్ రన్ రేట్ అవసరమైన ఇన్నింగ్స్‌లో ఆ తరహా ఆట తీరు ప్రదర్శించ లేకపోయారు. కనీసం ఓవర్లన్నీ కూడా ఆడలేక ప్రత్యర్థికి టైటిల్ అప్పగించారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి, ఇన్నింగ్స్‌లో చాలావరకు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడ్డారు. నిజానికి టోర్నీ ఆరంభంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలయ్యాక భారత్ పుంజుకుంది. వరుస విజయాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ తుదిపోరుకు చేరుకుంది. అయితే ఫైనల్లో ఆ తరహా పోరాటాన్ని కనబర్చడంతో విఫలమైంది.
భారత బౌలర్ల శ్రమ వృథా...
నిజానికి టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాను భారత బౌలర్లు బాగా కట్టడి చేశారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 49.1 ఓవర్లలో 198 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 35.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. 13 ఏళ్ల ఐపీఎల్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (9) విఫలమయ్యాడు. ఏడు బంతులు ఆడిన అతను కేవలం రెండు ఫోర్లు కొట్టి పెవిలియన్‌కు చేరాడు. నిజానికి బౌండరీలు బాది మంచి ఊపు మీదున్న సూర్యవంశీ.. ఇటీవల చేసిన మెరుపు సెంచరీ మాదిరి ఆట తీరును అభిమానులు ఆశించారు. అయితే అనవసర షాట్‌కు ప్రయత్నించి తన వికెట్ కోల్పోయాడు. ఆయుష్ మాత్రే కూడా ఒక్క పరుగుకే వెనుదిరగడంతో తొలి 5 ఓవర్లలో 24/2తో నిలిచింది. ఆ తర్వాత పరుగులు రాకుండా బంగ్లా బౌలర్లు, ఫీల్డర్లు కట్టదిట్టంగా వ్యవహరించడంతో టీమిండియా ఒత్తిడికి లోనైంది. ఆండ్రె సిద్ధార్థ్ (35 బంతుల్లో 20) కూడా విఫలమయ్యాడు. మహ్మద్ అమన్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనితో పాటు హార్దిక్ రాజ్ (24) తనకు లభించిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అయితే వీళ్ల పోరాటంతో భారత్ కనీసం వంద పరుగుల మార్కును దాటింది. బంగ్లా దేశ్ బౌలర్ అజిజుల్ హకీమ్ (3/8) పొదుపుగా బౌలింగ్ చేసి, కీలక సమయాల్లో వికెట్లు తీశాడు.
రిజాన్ హుస్సేన్ పోరాటం..
ఫైనల్ పోరులో పరుగులు చేయడానికి కష్ట సాధ్యమైన పిచ్‌పై బంగ్లా బ్యాటర్ రిజాన్ హుస్సేన్ (47) తన పోరాటంతో ఆకట్టుకున్నాడు. అతనికి షిహాబ్ జేమ్స్ (40), ఫరీద్ హుస్సేన్ (3) చక్కని సహకారం అందించాడు. దీంతో బంగ్లా గౌరవ ప్రదమైన స్కోరును చేరుకుంది. భారత బౌలర్లలో యుధజిత్ గుహ, చేతన్ శర్మ, రాజ్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. కిరణ్ చోర్మాలే, కార్తికేయ, మాత్రేకు తలో వికెట్ దక్కింది.
Also Read: Cricketers Retired in 2024: డేవిడ్ వార్నర్ నుంచి డికాక్ వరకూ, క్రికెట్ కు వీడ్కోలు పలికిన దిగ్గజాలు