కోట్ల మంది క్రికెట్‌ అభిమానుల హృదయాలను 2023 వన్డే ప్రపంచకప్‌ ముక్కలు చేసింది. కోట్ల మంది భారత అభిమానుల ఆశలు గల్లంతు చేస్తూ ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. ఆశలను.. ఆనందాలను.. అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్‌ సేనను ఫైనల్లో మట్టికరిపించి ఆరోసారి కంగారులు ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నారు. వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి చవిచూశాక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. పుష్కర కాలం తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే భారత జట్టు కల కలగానే మిగిలిపోయింది. దీనితో పాటు ఐసీసీ టోర్నీల్లో వరుస పరాజయాలు టీమిండియా అభిమానులను బాధ కలిగించాయి. ఆశలను కూలుస్తూ.. కన్నీళ్లు పెట్టించాయి. కానీ ఈ కొత్త ఏడాదిలో భారత్‌ ముంగిట ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటి అభిమానుల కన్నీళ్లను తుడిచే అవకాశం టీమిండియా స్టార్ల ముంగిట ఉంది. భారత్‌ను మరోసారి క్రికెట్లో విశ్వవిజేతగా నిలిపేందుకు.. 2024లో మరో ఛాన్స్‌ లభించనుంది. టీ20 ప్రపంచకప్‌ రాబోతోంది. ఈ పొట్టి కప్పులో విజేతగా నిలిచి.. కోట్లాది భారతీయుల్లో సంతోషాన్ని నింపాలని భారత క్రికెటర్లు కోరుకుంటున్నారు.

 

2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత భారత్‌ మరో ఐసీసీ టోర్నీ గెలవలేదు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌తో ఆ కరవు తీర్చాలని మన జట్టు పట్టుదలతో ఉంది. వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ పొట్టి కప్పు జూన్‌ 4 నుంచి 30 వరకు జరుగుతుంది. ఈ టోర్నీ దిశగా యువ జట్టును బీసీసీఐ సిద్ధం చేస్తోంది. మరోవైపు సెప్టెంబర్‌- అక్టోబర్‌ మధ్యలో మహిళల టీ20 ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌లో జరుగనుంది. తొలిసారి ఐసీసీ కప్పును ముద్దాడాలనే కలను తీర్చుకోవాలని  అమ్మాయిలు పట్టుదలగా ఉన్నారు. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే అండర్‌-19 ప్రపంచకప్‌లో దేశాన్ని విజేతగా నిలపాలని కుర్ర జట్టు ఉత్సాహంతో ఉంది. 

 

ఈ నెల 3న దక్షిణాప్రికాతో ఆరంభమయ్యే రెండో టెస్టుతో పురుషుల జట్టు ఈ ఏడాదిని మొదలెడుతుంది. ఆ తర్వాత జనవరి 11 నుంచి సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ ఆడుతుంది. అనంతరం స్వదేశంలో ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల్లో తలపడుతుంది. 3 వన్డేలు, 3 టీ20ల కోసం జులైలో శ్రీలంకకు వెళ్లనుంది. ఆ తర్వాత సొంతగడ్డపై వరుసగా సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో 2 టెస్టులు, 3 టీ20లు, అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో 3 టెస్టుల సిరీస్‌లు ఆడుతుంది. ఉర్రూతలూగించే ఐపీఎల్‌ మార్చి 22న... మహిళల ప్రిమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ ఫిబ్రవరి 22-మార్చి 17 వరకు జరిగే అవకాశముంది. 

 

ఈ ఏడాది ప్రతిష్టాత్మక టోర్నీలు...

 

పురుషుల క్రికెట్‌

జనవరి 3-7: భారత్‌ -దక్షిణాఫ్రికా రెండో టెస్టు 

జనవరి 11-17: భారత్‌లో అఫ్ఘానిస్థాన్‌ టూర్‌- 3 టీ20లు

జనవరి 25-మార్చి 11: భారత్‌లో ఇంగ్లండ్‌ టూర్‌-5 టెస్టులు

మార్చి నుంచి మే మధ్య : ఐపీఎల్‌ 

జూన్‌ 4-30 : ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ -వెస్టిండీ్‌స/అమెరికా 

జూలై : శ్రీలంకలో భారత జట్టు టూర్‌-3 వన్డేలు, 3 టీ20లు

సెప్టెంబరు: భారత్‌లో బంగ్లా జట్టు టూర్‌-2 టెస్టులు, 3టీ20లు

అక్టోబరు: భారత్‌లో న్యూజిలాండ్‌ జట్టు టూర్‌-3 టెస్టులు

నవంబరు-డిసెంబరు: ఆస్ట్రేలియాలో భారత్‌ టూర్‌-5 టెస్టులు

జనవరి 3-మార్చి 14: రంజీట్రోఫీ 

జూన్‌ 28-జూలై 16: దులీప్‌ ట్రోఫీ 

జూలై 24-ఆగస్టు 3: దేవధర్‌ ట్రోఫీ 

అక్టోబరు 1-5: ఇరానీ కప్‌ 

అక్టోబరు16-నవంబరు 6: ముస్తాక్‌ అలీ ట్రోఫీ

నవంబరు 23-డిసెంబరు15: విజయ్‌ హజారే ట్రోఫీ 

మహిళల క్రికెట్‌ 

జనవరి- ఆస్ట్రేలియా జట్టు టూర్‌ - ఏకైక టెస్టు, 3 టీ20లు, 3 వన్డేలు

ఫిబ్రవరి-మార్చి: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)

సెప్టెంబరు-అక్టోబరు : ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్‌క్‌ప-బంగ్లాదేశ్‌ 

డిసెంబరు: ఆస్ట్రేలియాలో భారత జట్టు టూర్‌-3 వన్డేలు

డిసెంబరు: భారత్‌లో వెస్టిండీస్‌ జట్టు టూర్‌-3 వన్డేలు, 3 టీ20లు