India Vs England 4th T20 Live Updates: పుణే టీ20లో భారత్ భారీ స్కోరు సాధించింది. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్ సాధించేందుకు భారత్ ముందడగు వేసింది. హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ ఫిఫ్టీ (30 బంతుల్లో 53, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తో రెచ్చిపోవడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ మంచి స్కోరు సాధించింది. అటు బ్యాటింగ్ కు ఇటు బౌలింగ్ కు అనుకూలమైన పిచ్‌పై బ్యాటర్లు తమవంతు పాత్ర పోషించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది.
ఆల్ రౌండర్ శివమ్ దూబే (34 బంతుల్లో 53, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ సెంచరీతో కీలకదశలో రాణించాడు. ఒకదశలో 79/5తో నిలిచిన జట్టును హార్దిక్, శివమ్ దూబే జంట ఆదుకుంది. ఆరో వికెట్ కు 87 పరుగులు జోడించింది. దీంతో ఇండియా అనుకున్నదానింకటే భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఈ ఘనత సాధించినట్లవుతుంది. బౌలర్లలో సాకిబ్ మహ్మూద్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఓవర్టన్ కు రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. అర్షదీప్ సింగ్, శివమ్ దూబే, రింకూ సింగ్ జట్టులోకి వచ్చారు. ఇంగ్లాండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది.
ట్రిపుల్ వికెట్ మెయిడిన్..
పుణే మ్యాచ్ ఆరంభంలో అభిమానులకు షాక్ తగిలింది. ఆరంబంలోనే ముగ్గురు కీలక ప్లేయర్లు ఔట్ కావడంతో ఒక్కసారిగా స్టేడియం అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యింది. పేసర్ తను వేసిన ఒకే ఓవర్లో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లను డకౌట్లుగా పెవిలియన్ కు పంపాడు. తొలుత తన బలహీనతన మరోసారి బయట పెట్టుకుంటూ ఫుల్ షాట్ కు సంజూ ఔటయ్యాడు. ఆ తర్వాత ఎదుర్కొన్న తొలి బంతినే డీప్ థర్డ్ మ్యాన్ కు క్యాచ్ ఇచ్చి తిలక్ ఔటయ్యాడు. రెండు బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో సాకిబ్ హ్యాట్రిక్ ముందు నిలిచాడు. సూర్య ఆ అవకాశాన్ని విఫలం చేసి, మరో మూడు బంతుల తర్వాత ఔటయ్యాడు. దీంతో వికెట్ మెయిడిన్ గా సాకిబ్ వేసినట్లయ్యింది. ఆ తర్వాత అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29, 4 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి రింకూ సింగ్ (30) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఓ వైపు రింకూ కాస్త స్లోగా ఆడితే, ఉన్నంత సేపు అభిషేక్ బ్యాట్ ఝుళిపించాడు. అలా నాలుగో వికెట్ కు 32 బంతుల్లో 45 పరుగులు జోడించారు. ఈ దశలో ఆదిల్ రషీద్.. అభిషేక్ ను బోల్తా కొట్టించడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఎనిమిదో ఓవర్ రెండో బంతిని ఊరించే విధంగా వేయగా, స్లాగ్ స్వీప్ కు ప్రయత్నించి అభిషేక్ ఔటయ్యాడు. ఇక నిలకడగా ఆడుతున్న రింకూను బ్రైడెన్ కార్స్ పెవిలియన్ కు పంపాడు. దీంతో 79 పరుగులకే సగం వికెట్లను భారత్ కోల్పోయింది.
సూపర్ భాగస్వామ్యం..
ఓ దశలో 150 పరుగులైనా భారత్ దాటుతుందా అన్న దశలో, భారీ స్కోరును సాధించడం వెనకాల దూబే, పాండ్య శ్రమ దాగుంది. వీరిద్దరూ ఆరంభంలో ఆచితూచి ఆడుతూనే, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. స్ట్రైక్ రొటేట్ చక్కగా చేయడంతో ఇంగ్లాండ్ పై ఒత్తిడి పడింది. అలా హుషారుగా వీరిద్దరూ ఆరో వికెట్ కు 87 పరుగులు జోడించారు. ఈక్రమంలో 27 బంతుల్లోనే పాండ్యా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్కోరు పెంచే క్రమంలో ఓవర్టన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (5) మరోసారి విఫలం కాగా, ఓ దశలో నిలబడిన దూబే.. స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. 31 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి, ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. బౌలర్లలో కార్స్, రషీద్ ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో దూబే, రింకూ సింగ్ ను తీసుకొని రావడం వల్ల ఇండియా, సాకిబ్ మహ్మూద్ ను ఆడించడం వల్ల ఇంగ్లాండ్ లాభపడ్డాయి.