Ind Vs Eng 4th T20i Live Updates: ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మరో హై వోల్టేజీ మ్యాచ్ రంగం సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య మరో టీ20 పోరుకు మహారాష్ట్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలోని పుణే వేదికగా సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. సిరీస్ లో తొలిసారి ఇంగ్లాండ్ టాస్ నెగ్గడం విశేషం. అటు  బ్యాటింగ్ కు, ఇటు బౌలింగ్ కు అనుకూలించగల ఈ పిచ్ పై ఇరు జట్లు  విజయంపై కన్నేశాయి. ముఖ్యంగా సిరీస్ ను ఈ మ్యాచ్ తోనే కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లు నెగ్గిన భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అయితే మూడో టీ20లో అనూహ్యంగా ఓడిపోయన భారత్ పుంజుకోవాలని చూస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు మంచి జోష్ లో ఉంది. అయినా కూడా ఈ మ్యాచ్ లో నెగ్గకపోతే సిరీస్ ప్రత్యర్థి వశమవుతుంది. అలాగే ఈ పిచ్ పై తమ ఆటగాళ్లు భారీగా పరుగులు సాధించాలని కోరుకుంటుంది. ఈ మ్యాచ్ లో భారత్ మూడు మార్పులు చేసింది. మహ్మద్ షమీ స్థానంలో అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో శివం దూబే, ధ్రువ్ జురెల్ స్థానంలో రింకూ సింగ్ జట్టులోకి వచ్చారు.  ఇంగ్లాండ్ జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. జేమీ స్మిత్ స్థానంలో జాకబ్ బెతెల్, మార్క్ వుడ్ స్థానంలో సాకిబ్ మహమూద్ జట్టులోకి వచ్చారు. 

బ్యాటింగ్ బలోపేతం..గత రెండు మ్యాచ్ ల్లో ఛేదనలో కాస్త ఇబ్బంది పడ్డ భారత్.. ఈ మ్యాచ్ లో తన బ్యాటింగ్ లైనప్ ను పటిష్టం చేసుకుంది. రింకూ, శివమ్ దూబే రాకతో బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఇక సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ ల నుంచి భారీ స్కోరు రావాల్సి ఉంది. మిడిలార్డర్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై ఎక్కువగా ఆధారపడుతోంది. అభిషేక్ శర్మ స్థిరంగా రాణించాల్సి ఉంది.  అలాగే వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ సత్తా చాటాల్సిన అవసరముంది. బౌలింగ్ బలంగా ఉంది, కానీ టెయిలెండర్లను ఔట్ చేయడంలో కాస్త ఇబ్బంది పడుతోంది. ఈ మ్యాచ్ లో ఆ బలహీనతను అధిగమించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. మరో రెండు వికెట్లు సాధిస్తే అర్షదీప్.. ఈ ఫార్మాట్లో వంద వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్ గా నిలుస్తాడు.  ఇక పుణేలోనే గెలిచి సిరీస్ దక్కించుకోవాలని, లేకపోతే చివరి మ్యాచ్ లో ఒత్తిడి భారత్ పైనే పడే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. 

ఆదిల్ పై పూర్తి భారం ..గత మూడు మ్యాచ్ ల్లో పేసర్లపై ఆధారపడ్డ ఇంగ్లాండ్.. రాజకోట్ టీ20లో విజయంతో తమ బౌలింగ్ ను స్పిన్ పై నమ్మకం పెంచుకుంది. వరల్డ్ నెంబర్ వన్ ఆదిల్ రషీద్ మరోసారి రాణించాలని భావిస్తోంది. మరో పేసర్ సాకిబ్ మహ్మూద్ ను జట్టులోకి తీసుకుంది. ఇక జట్టులో బ్యాటర్లు రాణించాల్సి ఉంది. , సాల్ట్, లివింగ్ స్టన్, హారీ బ్రూక్, జాకబ్ బెతెల్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఇక ఈ టీ20లో ఎలాగైనా గెలవాలన్న ఒత్తిడి మాత్రం ఉంది. ఈ నేపథ్యం లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డే అవకాశముంది. దీంతో పుణేలో మరో రసవత్తర పోరు జరుగనుంది. 

Also Read: U19 Women World Cup: ఫైనల్లో భారత్.. 9 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు.. 2న ఫైనల్లో సౌతాఫ్రికాతో టీమిండియా ఢీ