U-19 Women's T20 World Cup Semi-Final Highlights: భారత అండర్-19 మహిళా జట్టు అద్భుతం చేసింది. కౌలాలంపూర్ లో జరుగుతున్న మహిళా టీ20 ప్రపంచకప్ లో ఫైనల్ కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఓవర్లన్నీ ఆడి ఎనిమిది వికెట్లకు 113 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. జట్టులో ఓపెనర్ డావీనా పెర్రిన్ (40 బంతు్లో 45, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచింది. అనంతరం ఛేదనను 15 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 117 పరుగులతో భారత్ పూర్తి చేసింది. ఓపెనర్ కమలిని అజేయ ఫిఫ్టీ (50 బంతుల్లో 56 నాటౌల్, 8 ఫోర్లు)తో జట్టును విజయతీరాలకు చేర్చింది. మ్యాచ్ లో మూడు వికెట్లతో సత్తా చాటిన బౌలర్ పరుణికా సిసోడియాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. తాజా విజయంతో ఫైనల్ కు చేరిన భారత్, తుదిపోరులో సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2న ఆదివారం కౌలాలంపూర్ లో జరుగుతుంది.
కట్టడి చేసిన బౌలర్లు..టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు శుభారంభమే దక్కింది. ఓపెనర్ జెమీమా స్పెన్స్ (9), ట్రూడీ జాన్సన్ డకౌట్ తో విఫలమైనా కెప్టెన్ అబి నోర్గ్రోవ్ (25 బంతుల్లో 30, 3 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి ఈ జట్టును ముందుకు నడిపించింది. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న జంట, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ, చక్కగా స్ట్రైక్ రొటేట్ చేశారు. దీంతో జోరుగా స్కోరు బోర్డు ముందుకు సాగింది. ఒక దశలో 11వ ఓవర్ ముగిసేసరికి 81/2తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లాండ్ ఆ తర్వాత భారత బౌలర్ల మాయలో పడిపోయింది. ముందుగా డావీనాను ఔట్ చేసిన భారత బౌలర్లు, ఆ తర్వా త అబిని పెవిలియన్ కు పంపారు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు కూడా విఫలమవడంతో జట్టు చాలా తక్కువ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో వైష్ణవీ శర్మ మూడు వికెట్లతో సత్తా చాటింది. అలాగే ఆయుషీ శుక్లా రెండు వికెట్లతో రాణించింది.
త్రిష దూకుడు..ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న తెలంగాణ ప్లేయర్, ఓపెనర్ గొంగిడి త్రిష (29 బంతుల్లో 35, 5 ఫోర్లు) మరోసారి దూకుడుగా ఆడి జట్టుకు శుభారంభాన్ని అందించింది. స్వల్ప టార్గెట్ ను ఛేదించే క్రమంలో టీమిండియా ఒత్తిడికి లోనుకాకుండా త్రిష ఇన్నింగ్స్ ఉపకరించింది. తను కళ్లు చెదిరే ఐదు బౌండరీలు బాది స్కోరు బోర్డును పరుగులెత్తించింది. దీంతో తొలి వికెట్ కు 60 పరుగుల భారీ పార్ట్నర్ షిప్ నమోదు అయింది. ఈ దశలో స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో త్రిష ఔటైంది. ఆ తర్వాత కమిలిని, వన్ డౌన్ బ్యాటర్ సానిక చాల్కే (12 బంతుల్లో 11 నాటౌట్, 1 ఫోరు) తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. అబేధ్యమైన రెండో వికెట్ కు 57 పరుగులు జోడించింది. ఈక్రమంలో 47 బంతుల్లో ఫిఫ్టీ చేసిన కమిలిని.. ఆ తర్వాత మరో ఫోరుతో విన్నింగ్ షాట్ కొట్టి, జట్టును గెలిపించింది. త్రిష వికెట్ ను ఫోబ్ బ్రెట్ సాధించింది. ఇక ఫైనల్లో సౌతాఫ్రికాతోనూ ఇదే రకంగా ఆడి ట్రోఫీని గెలుపొందాలని భారత అభిమానులు పేర్కొంటున్నారు.