యువ భారత్‌ సత్తా చాటింది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ 20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. గత మ్యాచ్‌లో 220కు పైగా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన భారత బౌలర్లు... నాలుగో టీ 20 మ్యాచ్‌లో 174 పరుగుల లక్ష్యాన్ని కాపాడారు. దీంతో కంగారులపై టీమిండియా ఘన విజయం సాధించి అయిదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయాగా, ఆస్ట్రేలియా  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితమైంది. దీంతో యువ భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.



 ఈ విజయంతో టీమిండియా మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది. పాకిస్థాన్ పేరిట ఉన్న ప్రపంచరికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. టీమిండియా సిరీస్‌తో పాటు ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విజయంతో టీ20 క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటి వరకూ 213 మ్యాచ్‌లు ఆడిన భారతజట్టు.. 136 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇప్పటి వరకూ ఈ రికార్డు పాకిస్థాన్ జట్టు పేరు మీద ఉండేది. టీ20 ఫార్మాట్లో 226 మ్యాచ్‌లు ఆడిన పాక్.. 135 మ్యాచ్‌లలో గెలుపొందింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో గెలుపొందిన భారత్.. పాకిస్థాన్‌ను అధిగమించి ఈ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ విజయంతో టీ20 సిరీస్ కూడా కైవసం చేసుకున్న టీమిండియా.. సొంత గడ్డపై వరుసగా 14వ సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. టీమిండియా సొంతగడ్డపై ఆఖరిసారిగా 2019లో సిరీస్ కోల్పోయింది. 



 నాలుగో టీ 20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్.. రుతురాజ్‌ గైక్వాడ్‌ శుభారంభం అందించారు. పవర్‌ ప్లేలో ఆరు ఓవర్లలో 50 పరుగులు సాధించారు. యశస్వి జైస్వాల్‌ ఆరంభంలో దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 37 పరుగులు చేసి యశస్వి జైస్వాల్‌ అవుట్‌ అయ్యాడు. రుతురాజ్‌ అవుటైన తర్వాత వరుసగా రెండు వికెట్లు పడడంతో భారత్‌ కష్టాల్లో పడింది. ఈ సిరీస్‌లో తొలిసారి బరిలోకి దిగిన శ్రేయస్స్‌ అయ్యర్‌ తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరాడు. కేవలం ఏడు బంతులే ఎదుర్కొన్న అయ్యర్‌... ఎనిమిది పరుగులు చేసి సంఘా బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. అనంతరం కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరగడంతో టీమిండియా కష్టాల్లో పడింది. కేవలం రెండే బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక్కే పరుగు చేసి అవుటయ్యాడు. 50 పరుగులకు ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా పటిష్టంగా కనపడిన టీమిండియా 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 13 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగం తగ్గింది. అనంతరం 174 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 154 పరుగులకే పరిమితం అయ్యింది. అక్షర పటేల్ సహా భారత బౌలర్లు సమిష్టిగా రాణించగా కంగారూలు విజయానికి 20 పరుగుల తోనే నిలచిపోయారు. ట్రావీష్ హెడ్ 31, మాథ్యూ 36 పరుగులతో రాణించారు, మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. భారత్ బౌలర్ లలో అక్షర పటేల్ 3, దీపక్ 2 వికెట్లు తీశారు.