Ind Vs Aus Test Series: గత కొంతకాలంగా బ్యాట్ తో విఫలమవుతున్న భారత ఆటగాళ్లకు తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో షాక్ తగిలింది. ముఖ్యంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ర్యాంకుల్లో దిగజారారు. ముఖ్యంగా ఈ సీజన్ లో ఆకట్టుకోలేకపోతున్న రోహిత్.. తాజా ర్యాంకింగ్స్ లో ఏకంగా టాప్- 30 నుంచి బయటకు వెళ్లిపోయాడు. తాజా ర్యాంకింగ్స్ లో తను 6 స్థానాలు కోల్పోయి 31వ ర్యాంకులో నిలిచాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. బాబు పుట్టడంతో తొలి టెస్టుకు దూరంగా ఉన్న హిట్ మ్యాన్.. అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులో ఆడాడు. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి కేవలం 9 పరుగులే చేశాడు. 


టాప్-20లోకి పడిపోయిన కోహ్లీ..
మరో స్టార్ బ్యాటర్ కోహ్లీకి కూడా షాక్ తగిలింది. తాజా ర్యాంకింగ్స్ లో తను ఐదు స్తానాలు కోల్పోయి సరిగ్గా 20వ ర్యాంకులో నిలిచాడు. న్యూజిలాండ్ తో సొంతగడ్డపై జరిగిన సిరీస్ లో అంతంతమాత్రంగానే రాణించిన కోహ్లీ.. ఆసీస్ పర్యటనలో ఆడిన రెండు టెస్టుల్లో ఒక్క సెంచరీ మాత్రమే కొట్టాడు. మిగతా మూడు ఇన్సింగ్స్ లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇక తొలి టెస్టులో భారీ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ తన నాలుగో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. తను కూడా గాడిన పడాల్సిన అవసరం ఉంది. భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ మడూు స్థానాలు కోల్పోయి 9వ ర్యాంకుకు చేరుకున్నాడు. తన నుంచి కూడా పెద్ద ఇన్నింగ్స్ ను టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. గత పర్యటనలో బ్యాట్ తో చెలరేగిన పంత్.. ఈసారి ఆ మెరుపులు మాత్రం చూపించడం లేదు. రెండో టెస్టు మాత్రమే ఆడిన శుభమాన్ గిల్ ఒక స్థానం మెరుగు పర్చుకుని 17వ ర్యాంకు దక్కించుకున్నాడు. తెలుగు తేజం, ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆరు స్తానాలు ఎగబాకి 69వ ర్యాంకులో నిలిచాడు. 


Also Read: Shaheen Afridi: హిస్టరీ క్రియేట్ చేసిన ఆఫ్రిదీ.. పాక్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక మొనగాడు


రూట్ కు చేజారిన టాప్ ర్యాంకు..
టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ లేపే ఇంగ్లీష్ బ్యాటర్ జో రూట్ తడబడ్డాడు. తాజా ర్యాంకింగ్స్ లో తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. న్యూజిలాండ్ తో సిరీస్ లో రాణించినప్పటికీ, అతని కంటే మెరుగ్గా ఆడుతున్న సహచరుడు హేరీ బ్రూక్ టాప్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య రేటింగ్ పాయింట్ల తేడా ఒక్క పాయింటే కావడం విశేషం. బ్రూక్ ఖాతాలో 898 పాయింట్లు ఉండగా, రూట్  897 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. భారత్ కు కొరకరాని కొయ్యలాంటి ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ టాప్-10 ర్యాంకులోకి చేరుకున్నాడు. అడిలైడ్ టెస్టులో తను అద్భుతమైన సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. అశ్విన్ ర్యాంకు ఒక స్థానం పడిపోయి ఐదో స్థానంలో నిలిచాడు. ఇక రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఉన్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక, ఐదు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్, ఆసీస్ చెరో టెస్టు గెలిచాయి. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఈనెల 14 నుంచి బ్రిస్బేన్ లో జరుగుతుంది. 


Also Read: ICC Punishment: అంపైర్లను దూషించిన ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయర్- ఐసీసీ కన్నెర్ర