ICC Champions Trophy Live Updates: ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ సెమీస్ కు దూసుకెళ్లాయి. సోమవారం గ్రూపు-బిలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 5 వికెట్లతో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ విజయంతో చెరో రెండు విజయాలతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నాకౌట్ కు చేరుకున్నాయి. దీంతో మార్చి 2న కివీస్, భారత్ ల మధ్య, ఈనెల 27న పాక్, బంగ్లాల జరిగే మ్యాచ్ లు అప్రధాన్యమైనవి అయిపోయాయి. అయితే గ్రూపు విజేతను తేల్చడంలో కివీస్, భారత్ మ్యాచ్ ఉపయోగ పడనుంది. ఇక, రావల్పిండిలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 236 పరుగులు చేసింది. నజ్ముల్ హుస్సేన్ షాంటో (110 బంతుల్లో 77, 9 ఫోర్లు) కెప్టెన్స్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. బౌలర్లలో మైకేల్ బ్రాస్ వెల్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఛేదనను 46.5 ఓవర్లలో 5 వికెట్లకు 240 పరుగులు చేసి, పూర్తి చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (105 బంతుల్లో 112, 12 ఫోర్లు, 1 సిక్సర్) సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో గ్రూపు-బిలో న్యూజిలాండ్, భారత్ వరుసగా అగ్రస్థానంలో నిలిచాయి. బ్రేస్ వెల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
విఫలమైన మిడిలార్డర్..
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాకు ఓపెనర్లు తంజిద్ హసన్ (24), నజ్ముల్ కు మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 45 పరుగులు జోడించారు. అయితే తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలమయ్యారు. భారత్ తో గత మ్యాచ్ లో సెంచరీ చేసిన తౌహిద్ హృదయ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. ఇక 71 బంతుల్లో ఫిఫ్టీ చేసిన తర్వాత శాంటో కూడా పెవిలియన్ కు చేరాడు. చివర్లో జాకీర్ అలీ (45), రిషాద్ హుస్సేన్ (26) కాస్త పోరాడటంతో బంగ్లా గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. మిగతా బౌలర్లలో విల్ ఓ రౌర్క్ కు రెండు, కైలీ జెమిసన్, మ్యాట్ హెన్రీకి చెరో వికెట్ దక్కింది.
రచిన్ అదుర్స్..
ఛేదనలో కివీస్ ఆరంభంలో ఇబ్బందుల్లో పడింది. విల్ యంగ్ డకౌట్, కేన్ విలియమ్సన్ (5) త్వరగా ఔట్ కావడంతో 15-2తో కష్టాల్లో నిలిచింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన రచిన్.. సిసలైన ఆటతీరును కనబర్చాడు. ఫస్ట్ ఓపెనర్ డేవన్ కాన్వే (30)తో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. అతను వెనుదిరిగాక టామ్ లేథమ్ (55) భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. బంగ్లా బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఈ జంట ఆడుతూ పాడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించింది. దీంతో నాలుగో వికెట్ కు 129 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. 95 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన రచిన్.. అరంగేట్రంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన బ్యాటర్ల జాబితాలో చేరాడు. మరోవైపు 71 బంతుల్లో లేథమ్ కూడా ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ వెనుదిరిగినా, గ్లెన్ ఫిలిప్స్ (21 నాటౌట్), బ్రాస్ వెల్ (11 నాటౌట్) జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో మెగాటోర్నీలో వరుసగా మూడోసారి భారత్ సెమీస్ కు చేరుకున్నట్లయ్యింది. అలాగే కివీస్ కూడా నాకౌట్ కు చేరుకుంది. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్, నహీద్ రాణా, ముస్తాఫిజుర్ రహ్మాన్, రిషాద్ హుస్సేన్ లకు తలో వికెట్ దక్కింది.