వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడిన భారత మహిళల జట్టు... మూడు మ్యాచుల టీ సిరీస్‌ను ఘన విజయంతో ప్రారంభించింది. మొదట ఆస్ట్రేలియా(Austrelia)ను తక్కువ పరుగులకే కట్టడి చేసిన టీమిండియా ఉమెన్స్‌ టీం(Team India Womens ).... తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. మొదట తితాస్‌ సాధు అద్భుత బౌలింగ్‌తో కంగారు జట్టును కట్టిపడేసింది. తర్వాత ఓపెనర్‌ షెఫాలి వర్మ, స్మృతి మంధాన మెరుపులతో తొలి టీ 20 మ్యాచ్‌లో విజయదుంధుబి మోగించింది. 


ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా.. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలోనే పర్వాలేదనిపించిన కంగారుల బ్యాటింగ్‌...యువ పేసర్‌ తితాస్‌ సాధు బౌలింగ్‌కు రాగానే కకావికలమైంది. యువ పేసర్‌ తితాస్‌ సాధు లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. 3.5 ఓవర్లలో 28 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా... ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. బెత్‌మూనీని తొలుత పెవిలియన్‌కు పంపిన తితాస్‌ సాధు... తాలియా మెక్‌గ్రాత్‌ (0), ఆష్లీ గార్డ్‌నర్‌ (0) వికెట్లను కూడా తీసి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించింది. ఓ దశలో 28 పరుగులకు ఒక్క వికెట్‌ కూడా కోల్పోని ఆస్ట్రేలియా... తితాస్‌ సాధు వరుసగా వికెట్లు తీయడంతో 6 ఓవర్లకు ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 33 పరుగులతో కష్టాల్లో పడింది. ఆ జట్టు బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న తీరు చూస్తే 100 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ లిచ్‌ఫీల్డ్‌.. ఎలిస్‌ పెర్రీ మరోసారి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఎలిస్‌ పెర్రీ 30 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 పరుగులు చేయగా.... లిచ్‌ఫీల్డ్‌ 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 49 పరుగులు చేసి అర్ధ శతకానికి ఒక్క పరుగు దూరంలో అవుటైంది. వీరి దూకుడుతో 14 ఓవర్లలో ఆస్ట్రేలియా 112 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్‌ (2/19), దీప్తిశర్మ (2/24) విజృంభించడంతో ఆసీస్‌ తడబడింది. భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో లిచ్‌ఫీల్డ్‌ ఔట్‌ కావడంతో మొదలైన పతనం ఆ తర్వాత ఆగలేదు. ఆస్ట్రేలియా తన చివరి 6 వికెట్లను కేవలం 29 పరుగుల తేడాతో చేజార్చుకుంది. దీంతో 19.2 ఓవర్లలో ఆస్ట్రేలియా 141 పరుగులకు ఆలౌట్‌ అయింది.



 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు లక్ష్య చేధన కష్టంగానే అనిపించింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ సాగిన తీరు చూస్తే ఛేదన భారత్‌కు కూడా కష్టమే అనిపించింది. కానీ డార్సీ బ్రౌన్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే 14 అదనపు పరుగులు రావడం భారత్‌కు కలిసొచ్చింది. అక్కడ నుంచి ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మంధాన ఎదురుదాడికి దిగి ప్రత్యర్థి బౌలర్లకు అవకాశమే లేకుండా చేశారు. వీరి ధాటికి పవర్‌ప్లేలో భారత్‌ ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 59 పరుగులు చేసింది. ఆ తర్వాత స్మృతి-షెఫాలి జోరు పెంచి భారత్‌ను లక్ష్యానికి చేరువ చేశారు. ఈ క్రమంలోనే ఓపెనర్లిద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వికెట్‌ పడకుండానే ఛేదన పూర్తవుతుందేమో అనిపించినా.. ఓ షాట్‌కు ప్రయత్నించి మంధాన ఔటైంది. దీంతో 137 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత జెమీమాతో కలిసి షెఫాలి పని పూర్తి చేసింది.  షెఫాలి వర్మ (64 నాటౌట్‌; 44 బంతుల్లో 6×4, 3×6), స్మృతి మంధాన (54; 52 బంతుల్లో 7×4, 1×6) మెరుపులతో లక్ష్యాన్ని భారత్‌ 17.4 ఓవర్లలో ఒక వికెటే కోల్పోయి అందుకుంది.