IND vs WI: 


కొన్నిసార్లు ఓడిపోవడమూ మంచిదేనని టీమ్‌ఇండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) అంటున్నాడు. ఇలాంటి సందర్భాల్లోనే మనం ఎక్కడ వెనకబడుతున్నామో తెలుస్తుందని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌ సిరీసులో కుర్రాళ్లు తెగువను ప్రదర్శించారని వెల్లడించాడు. ఐదో టీ20లో తన రాకతోనే మూమెంట్‌ చేజారిందని అంగీకరించాడు. సమయం తీసుకున్నప్పటికీ గెలిపించలేకపోయానని అన్నాడు. మ్యాచ్‌ ఓటమి తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.


వెస్టిండీస్‌తో (IND vs WI) జరిగిన ఐదో టీ20లో టీమ్‌ఇండియా పరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించింది. ఆ తర్వాత వెస్టిండీస్ 18 ఓవర్లలోనే రెండు వికెట్లు చేజార్చుకొని టార్గెట్‌ ఛేజ్‌ చేసింది. 3-2తో సిరీస్‌ కైవసం చేసుకుంది. కరీబియన్లలో బ్రాండన్ కింగ్ (85: 55 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు), నికోలస్ పూరన్ (47: 35 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) రాణించారు. భారత్‌లో సూర్యకుమార్ యాదవ్ (61: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌. తిలక్ వర్మ (27: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అతడికి సహకారం అందించాడు.


'నేను క్రీజులోకి వచ్చినప్పుడే మూమెంటమ్‌ చేజారింది. పరిస్థితులను అనుకూలంగా మలచలేకపోయాను. సవాళ్లు ఎదుర్కోవడం, మెరుగయ్యేందుకు ప్రయత్నించడాన్ని మేం నమ్ముతాం. ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. మా బృందంలో కుర్రాళ్లు ఎలా ఉన్నారో తెలుసు. తప్పిదాలు సరిదిద్దుకోవడానికి చాలా సమయం ఉంది. కొన్నిసార్లు ఓడిపోవడమూ మంచిదే' అని హర్దిక్‌ పాండ్య అన్నాడు.


'ఆఖరి పది ఓవర్లలోనే మేం ఓడిపోయాం. క్రీజులోకి వచ్చినప్పటి నుంచీ పరిస్థితులను అనుకూలంగా మలచలేకపోయాను. సమయం తీసుకున్నా ముగించలేకపోయాను. ఒక బృందంగా మేం సవాళ్లను ఎదుర్కోవడం ముఖ్యం. ఇవన్నీ మేం నేర్చుకోవాల్సిన మ్యాచులు. మేమంతా కలిసి ఒక బృందంగా చర్చించుకొనే కఠిన దారిలో పయనిస్తాం. ఒక సిరీసు ఓడిపోయినంత మాత్రాన ఇబ్బందేం లేదు. మాకు అసలైన లక్ష్యమే ముఖ్యం' అని అని పాండ్య పేర్కొన్నాడు.


'మాది సుదీర్ఘమైన రహదారి. కొన్ని రోజుల్లోనే వన్డే ప్రపంచకప్‌ ఉంది. కొన్నిసార్లు ఓడిపోవడమూ మంచిదే. చాలా నేర్చుకోవచ్చు. ఇక కుర్రాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వాళ్లు గొప్పగా పోరాడారు. తమ క్యారెక్టర్‌ను ప్రదర్శించారు. గెలుపోటములు ప్రాసెస్‌లో ఒక భాగం. మేం కచ్చితంగా వీటి నుంచి నేర్చుకుంటాం' అని పాండ్య అన్నాడు. ఆఖరి మ్యాచులో అతడు చేసిన బౌలింగ్‌ మార్పులను చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే తన ఆలోచనలను బట్టే నిర్ణయాలు తీసుకుంటానని అంటున్నాడు.


'ఆ మూమెంట్‌లో ఏమనిపిస్తే అదే చేస్తాను. ఎక్కువగా ప్లాన్‌ చేయను. అప్పుడున్న సిచ్యువేషన్‌ను బట్టి నాకేం తోస్తే అదే చేస్తాను. యశస్వీ జైశ్వాల్‌, తిలక్‌ వర్మను ప్రత్యేకంగా అభినందించాల్సిందే. వాళ్లు చాలా ధైర్యంగా ఆడారు. ఇంటర్నేషనల్‌ క్రికెట్లో ఇదే ముఖ్యం. వారిలో దీనిని చూస్తున్నాను. వాళ్లు నిలబడి బాధ్యతలు తీసుకున్నారు. ఒక కెప్టెన్‌గా నాకిది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది' అని హార్దిక్‌ తెలిపాడు.


Also Read: సిరీస్ వెస్టిండీస్‌దే - చివరి టీ20లో టీమిండియా ఘోర పరాజయం!