భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో వెస్టిండీస్ కుప్పకూలింది. వెస్టిండీస్‌ను తమ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకే కుప్పకూల్చింది. రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. వెస్టిండీస్ బ్యాటర్లలో కెరీర్‌లో మొదటి టెస్టు ఆడుతున్న ఆలిక్ అథనజే (47: 99 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
మంచి ఆరంభం లభించినా...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు ప్రామిసింగ్ స్టార్ట్ లభించింది. మొదటి 12 ఓవర్ల పాటు ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (20: 46 బంతుల్లో, మూడు ఫోర్లు), తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (12: 44 బంతుల్లో) వికెట్ ఇవ్వకుండా ఆపారు. మొదటి వికెట్‌కు వీరు 31 పరుగులు జోడించారు. ఈ దశలో తేజ్‌నారాయణ్ చందర్‌పాల్‌ను అవుట్ చేసి అశ్విన్ భారత్‌కు మొదటి వికెట్ అందించాడు. దీంతో అశ్విన్ ఒక ప్రత్యేకమైన రికార్డు కూడా సాధించాడు. 2011లో తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ తండ్రి శివ్‌నారాయణ్ చందర్‌పాల్‌ను అశ్విన్ అవుట్ చేశాడు. తండ్రీ కొడుకులు ఇద్దరినీ అవుట్ చేసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు.
కాసేపటికే క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను కూడా అవుట్ చేసి అశ్విన్ రెండో వికెట్ కూడా పడగొట్టాడు. ఆ తర్వాత వచ్చిన వారెవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. అశ్విన్‌కు మిగతా బౌలర్ల నుంచి చక్కటి సపోర్ట్ లభించింది. ఆరో వికెట్‌కు ఆలిక్ అథనజే (47: 99 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), జేసన్ హోల్డర్ (18: 61 బంతుల్లో, ఒక ఫోర్) జోడించిన 41 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తున్నా వెస్టిండీస్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు.
లంచ్ సమయానికి వెస్టిండీస్ నాలుగు వికెట్ల నష్టానికి జోడించింది. రెండో సెషన్‌లో కూడా వెస్టిండీస్ పరిస్థితి మెరుగుపడలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో టీ బ్రేక్‌కు ఎనిమిది వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. మూడో సెషన్‌లో కేవలం 13 పరుగులే జోడించి ఆఖరి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో వెస్టిండీస్ 150 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజాకు మూడు వికెట్లు దక్కాయి. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది.