IND vs SL 3rd T20: ఏమా ఆట.. ఏమా షాట్లు.. ఏంటా పరుగులు... టీ20 అంటే ఇలానే ఆడాలి అన్నట్లుగా సూర్యకుమార్ యాదవ్ రాజ్ కోటలో చెలరేగిపోయాడు. గతేడాది ఫాంను కొనసాగిస్తూ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడేశాడు. బంతి ఎక్కడ వేసినా దాని గమ్యం బౌండరీనే అన్నట్లుగా కొట్టాడు. అతని ఆటకు శ్రీలంక బౌలర్లు తలలు పట్టుకుంటే.. ఫీల్డర్లు ప్రేక్షకుల్లా మారిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన స్కై టీ20ల్లో మూడో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. జట్టుకు భారీ స్కోరు అందించాడు.
రాజ్ కోట్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా 228 పరుగుల భారీ స్కోరు సాంధించింది. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో (51 బంతుల్లో 112 పరుగులు) చెలరేగగా.. గిల్ (36 బంతుల్లో 46), రాహుల్ త్రిపాఠి (16 బంతుల్లో 35) రాణించారు.
తొలి ఓవర్లోనే షాక్
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. పేలవ ఫామ్ లో ఉన్న ఓపెనర్ ఇషాన్ కిషన్ మధుశంక బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. గిల్ నెమ్మదిగా ఆడటంతో ఆ తర్వాత 2 ఓవర్లలో ఎక్కువ పరుగులు రాలేదు. అయితే వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి రెచ్చిపోయి ఆడాడు. వచ్చీ రావడంతోనే 2 బౌండరీలు కొట్టిన రాహుల్.. చమిక కరుణరత్నే వేసిన 6వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాదాడు. అయితే ఆ తర్వాతి బంతికే అతను ఔటయ్యాడు. పవర్ ప్లే అయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా 52 పరుగులు చేసింది.
సూర్య ప్రతాపం
ఆ తర్వాత ఇంక అంతా సూర్య ప్రతాపమే. వచ్చీ రావడంతోనే బాదుడు మొదలుపెట్టిన సూర్యకుమార్ ఎక్కడా తగ్గలేదు. తన ఇన్నింగ్స్ అంతటా హిట్టింగే హిట్టింగ్. బౌలర్ ఎవరైనా బాదడం మాత్రం ఆపలేదు సూర్య. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించిన స్కై సెంచరీతో చెలరేగాడు. 25 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన సూర్యకుమార్ మహీశ్ థీక్షణ వేసిన 14వ ఓవర్లో విధ్వంసమే సృష్టించాడు. ఆ ఓవర్లో వరుసగా 4,6,6 బాదాడు. గిల్ కూడా ఒక ఫోర్ సాధించటంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. అనంతరం హసరంగ బౌలింగ్ లో గిల్ బౌల్డయ్యాడు. గిల్, సూర్య మూడో వికెట్ కు 111 పరుగులు జోడించారు. అనంతరం జోరు పెంచిన సూర్య 41 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. 51 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. మధ్యలో హార్దిక్ పాండ్య (4), దీపక్ హుడా (4) అలా వచ్చి ఇలా వెళ్లారు. చివర్లో అక్షర్ పటేల్ (9 బంతుల్లో 21) వేగంగా ఆడాడు.
శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 2 వికెట్లు తీసుకున్నాడు. రజిత, కరుణరత్నే, హసరంగా తలా వికెట్ దక్కించుకున్నారు.